బ్రిజ్​భూషణ్​పై వెయ్యి పేజీల చార్జీషీట్​

బ్రిజ్​భూషణ్​పై వెయ్యి పేజీల చార్జీషీట్​
  • పోక్సో తొలగించాలని పోలీసుల నివేదిక
  • జులై 4న విచారించనున్న కోర్టు

న్యూఢిల్లీ: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై గురువారం వెయ్యి పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును తొలగించాలని మరో నివేదికను కూడా సమర్పించడం గమనార్హం.  దీంతో పోక్సో కేసు నుంచి బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జులై 4 న జరపనుంది.

అయితే ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌కు పోక్సో కేసులో ఢిల్లీ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంపై పలు విమర్శలొస్తున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఏడుగురు రెజ్లర్లలో ఒకరు మైనర్ అని.. ఆమెపైనా బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడని ఆ మైనర్ తండ్రి మొదట ఫిర్యాదు చేయడంతో ఏప్రిన్ 28 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టారు. అయితే తర్వాత ఆమె మైనర్ కాదని.. ఆమె తండ్రి తన కేసును వెనక్కి తీసుకోవడంతో పోక్సో కేసు నమోదు కాలేదు. దీంతో ఆయనపై పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను ఢిల్లీ పోలీసులు సమర్పించారు. దీనిపై జులై 4 వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది.
ఇటీవల కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌పై జూన్ 15 లోపు ఛార్జిషీట్ దాఖలు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ నిరసనలను తాత్కాలికంగా విరమించారు. అయితే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తీర్చకపోతే ఈ ఏడాది జరగనున్న ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. మరోవైపు.. రెజ్లింగ్ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రిటర్నింగ్ అధికారిగా నియమించింది. జూలై 6 న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్యానెల్‌ను ఎన్నుకోనున్నట్లు స్పష్టం చేసింది.