రావణ దహనం చేస్తున్న మొట్టమొదటి మహిళ నటి కంగనా రనౌత్

రావణ దహనం చేస్తున్న మొట్టమొదటి మహిళ నటి కంగనా రనౌత్

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసే భారతదేశపు మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద గల రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసే అవకాశాన్ని లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ నటి కంగనా రనౌత్ కు కల్పించింది. యాభయ్యేళ్ల చరిత్రలో ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటి సారిగా ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తోందని, జై శ్రీరామ్ అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లెఫ్టినెంబ్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు సనాతన ధర్మ వ్యతిరేకుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గత సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన సందర్భంలో మహిళలకు సంపూర్ణ మద్దతును ప్రకటించేలా ఈ నిర్ణయాన్ని కమిటీ తీసుకుందని ఆయన వెల్లడించారు. సాధారణంగా భారత ప్రధాని రావణ దహనం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కారణంగా బిజీగా ఉండడంతో లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని అర్జున్ కుమార్ తెలిపారు.