ముఖర్జీ భవన్​లో మంటలు

ముఖర్జీ భవన్​లో మంటలు
  • పలువురు విద్యార్థులకు గాయాలు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ముఖర్జీ భవన్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో ఫ్లోర్​లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్థులు క్లాస్‌రూంలలో నుంచి పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరిగెత్తారు. ఇందులో భాగంగానే కొంతమంది విద్యార్థులు కిటికీల నుంచి కిందికి దూకారు. వైర్ల సాయంతో వేలాడుతూ కిందికి దిగారు. గాయాలైన పలువురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించిన 11 ఫైరింజన్లను రంగంలోకి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని మాపక సిబ్బంది సమయానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడగా.. మిగిలిన వారు సురక్షితంగా కిందకు దిగినట్లు అధికారుల వెల్లడించారు. కోచింగ్ సెంటర్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ మీటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.