అభివృద్ధికి సూచిక సంస్కృతి - జీ20లో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి

అభివృద్ధికి సూచిక సంస్కృతి - జీ20లో కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి

కర్ణాటక: ‘సంస్కృతి మన గుర్తింపులో ఒక భాగం మాత్రమే కాదని,  స్థిరమైన అభివృద్ధికి సూచికని, దీనిని భవిష్యత్‌ తరాలకు అందజేసేందుకు మనమంతా కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషి అన్నారు. కర్ణాటకలోని హంపి వేదికగా జీ20 దేశాల కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ సమ్మిట్‌ జూలై 12 వరకు కొనసాగనున్నాయి. జీ20 సభ్య దేశాలు , అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. సంస్కృతిని కాపాడుకునేందుకు నాలుగు ప్రాధాన్యతలను గుర్తించామని కేంద్రమంత్రి అన్నారు. 1. సాంస్కృతిక ఆస్తుల రక్షణ, పునరుద్ధరణ, 2. స్థిరమైన భవిష్యత్తు కోసం సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించడం, 3. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, 4. సంస్కృతి రక్షణ, ప్రమోషన్‌ కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం’ అని ప్రహ్లాదక్ష జోషి తెలిపారు. ఈ నాలుగు కార్యక్రమాలు సాంస్కృతికంగా విభిన్నమైనప్పటికీ ఏకీకృత ప్రపంచానికి దోహదం చేస్తాయని, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందజేయవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు.కాగా సాంస్కృతిక కార్యవర్గం తొలుత రెండు సమావేశాలు కాజురావ్, భువనేశ్వర్‌లలో జరిగాయి . నాలుగో సమావేశం వారణాసిలో జరగనుంది. సెప్టెంబరులో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది , అందుకోసం గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అనుబంధ సమావేశాలు జరిగాయి . బెంగళూరులో కూడా సమావేశాలు జరిగాయి.