కళాక్షేత్రలో లైంగిక వేధింపులు

కళాక్షేత్రలో లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల నిరసనలతో తమిళనాడు  దద్దరిల్లుతోంది. ప్రతిష్ఠాత్మక సంప్రదాయ కళల సంస్థ కళాక్షేత్ర ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ సంస్థలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మరో ముగ్గురు ఆర్టిస్టులు తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ పూర్వ విద్యార్థిని చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. లైంగిక వేధింపులు, బాడీషేమింగ్, దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలపై  కొద్దిరోజులుగా దాదాపు 200 మంది విద్యార్థినులు, విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది.  90 మంది విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్‌ చీఫ్‌కు ఫిర్యాదుచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌( MK Stalin)కు లేఖ రాశారు. తప్పు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. స్టాలిన్‌తోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డికి రాసిన లేఖలో.. ఏళ్లుగా ఈ వేధింపులు, వర్ణ వివక్ష ఎదుర్కొంటున్నామని, ఈ ఫిర్యాదులపై యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కళాక్షేత్ర డైరెక్టర్‌ రేవతి రామచంద్రన్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అంటూ జాతీయ మహిళా కమిషన్ తోసిపుచ్చడం గమనార్హం.