తిరుపతి వెంకన్నకు కానుకల వర్షం

తిరుపతి వెంకన్నకు కానుకల వర్షం

తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ కి కాసుల వర్షం కురుస్తోంది. మార్చి నెలలోకూడా వరుసగా భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం  ప్రతీనెల 100 కోట్లకుపైగానే సమకూరుతూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ. 120.29 కోట్లు లభించింది. మార్చినెలతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంకుగాను తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1,520.29 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు  తెలిపారు.  తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ నెలాస్వామివారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరంలో అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు. అత్యధికంగా గతేడాది ఆగస్టు నెలలో 140.34 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.  2021 (జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు) సంవత్సరంలో 1.04 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా రూ. 833.41 కోట్లు ఆదాయం సమకూరింది.