సీఎం మార్నింగ్​ వాక్.. దూసుకొచ్చిన బైకర్​

సీఎం మార్నింగ్​ వాక్.. దూసుకొచ్చిన బైకర్​
  • నితీశ్​ అప్రమత్తతో తప్పిన ముప్పు
  • భద్రతపై అత్యున్నతస్థాయి సమీక్షలో ఆగ్రహం

బీహార్​: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా.. ఓ యువకుడు బైక్‌పై అతి సమీపానికి వచ్చాడు. ఢీకొట్టినంత పనిచేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫుట్‌పాత్‌ పైకి దూకి అతడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం భద్రతాధికారులు యువకుడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఓ యూట్యూబర్ అని, బైక్ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో రీల్స్ లోడ్ చేస్తాడని తెలుస్తోంది.

గురువారం (జూన్ 15) ఉదయం సీఎం నితీష్ కుమార్ మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం సీఎం అధికారిక నివాసంలో అధికారులు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం నితీష్ కుమార్ భద్రతలో వైఫల్యం గురించి చర్చించారు. బైక్‌పై దూసుకొచ్చిన యువకుడిని వెంబడించి వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కాగా సీఎం భద్రతా వలయాన్ని ఛేదించుకుని యువకుడు బైక్‌పై ఆయనకు అత్యంత సమీపానికి రావడం నితీశ్​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సర్క్యులర్‌ రోడ్డులో మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల నివాసాలు ఉన్నాయి. సీఎం నితీష్ కుమార్ నిత్యం ఉదయపు నడక కోసం సర్క్యులర్‌ రోడ్డుకే వస్తారు. ఆయన వాకింగ్ చేసే సమయంలో ఆ మార్గంలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. అలాంటి భద్రత వలయాన్ని దాటుకుని యువకుడు బైక్‌పై ముఖ్యమంత్రికి అతి సమీపంగా రావడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటన అనంతరం ఎస్‌ఎస్‌జీ కమాండెంట్‌, పాట్నా ఎస్‌ఎస్పీని సీఎం నీతీష్ తన నివాసానికి పిలిపించుకొని సమావేశమయ్యారు.