విపక్షాల ఐక్యతా యత్నాలు కేజ్రివాల్ ను ఆదుకుంటాయా?

విపక్షాల ఐక్యతా యత్నాలు కేజ్రివాల్ ను ఆదుకుంటాయా?

నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డినెన్స్ మీద అధికార, ప్రతిపక్షాల మధ్య బలాబలాల ప్రదర్శనకు రంగం సిద్ధమవుతున్నది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల ఐక్యతా సాధన కూడా ఈ అంశంతో ముడిపడి ఉన్నది. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులపై పర్యవేక్షణ, బదిలీల వంటి  అంశాలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే నెలలో ఇచ్చిన తీర్పును ఖాతరు చేయకుండా ఢిల్లీ పాలన వ్యవస్థపై లెఫ్టినెంట్ గవర్నర్ పట్టును కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్సు తీవ్ర విమర్శల పాలైన నేపథ్యంలో దాని స్థానంలో ఒక చట్టాన్ని తేవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దానికి సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాలని కోరుతూ విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ‘ఎక్కే గుమ్మం దిగే గుమ్మం’ అన్నట్టుగా విపక్ష నేతలందరినీ కలిసి మద్దతు కోరుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వకుండా, సమాఖ్య వ్యవస్థను గౌరవించకుండా ఐఏఎస్ అధికారులపై అజమాయిషీని లెఫ్టినెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అటు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ధిక్కరించడమే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును సైతం గుర్తించడానికి నిరాకరించడమే అవుతుంది. ఢిల్లీలో ఐఏఎస్ అధికారుల మీద పర్యవేక్షణ బాధ్యతను 2015 లో కేంద్ర హోమ్ శాఖ లాగేసుకొని లెఫ్టినెంట్ గవర్నర్ కు అప్పగించడంతో ఘర్షణ మొదలైంది. దీనితో పాలన వ్యవస్థ పై ఢిల్లీ ప్రభుత్వం పట్టుకోల్పోయింది. ఉన్నతాధికారులను లెఫ్టి నెంట్ గవర్నర్ తరచూ బదిలీ చేస్తూ కేజ్రీవాలీ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించారు. కోవిడ్ సమయంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శిని లెఫ్టినెంట్ గవర్నర్ ఎనిమిది సార్లు బడైలీ చేశారు. దాంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టవలసిన సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. గత యేడాదిన్నర కాలంలో కూడా అనేక మంది అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడింది. కోర్టులలో దీర్ఘకాలం నలిగిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే11న చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 'నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 199' ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి సివిల్ సర్వీసెస్ అధికారుల మీద ఉంటుందని, గవర్నర్ అందుకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు నిష్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు మింగుడు పడని కేంద్ర ప్రభుత్వం మే 25న ఒక ఆర్డినెన్స్ తెస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కి తిరిగి అధికారాలను కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఇప్పుడు కేజ్రీవాల్ వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులను ముఖ్యమంత్రులను కలుస్తూ ఈ విషయంలో వారి మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.