మొరాకో విధ్వంసం

మొరాకో విధ్వంసం
  • అంతులేని విషాదం
  • మృతులు దాదాపు 2 వేలు 
  • గంటగంటకూ పెరుగుతున్న సంఖ్య
  • 3 వేల మందికి గాయాలు
  • ఎక్కడ చూసినా శిథిల భవనాలే
  • మిన్నంటుతున్న బాధితుల రోదనలు
  • సహాయ కమిషన్​ఏర్పాటు
  • మూడు రోజులు సంతాప దినాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

ముద్ర, నేషనల్ డెస్క్ : మొరాకో భూకంపంలో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం వెయ్యి మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారానికి ఆ సంఖ్య రెండు వేలకు చేరిందని, దాదాపు మూడు వేల మంది గాయపడ్డారని అధికారులు తెలిసారు. భూకంపం నుంచి తేరుకునేందుకు మొరాకోకు చాలా సమయం పట్టనుందని వెల్లడించారు. సహాయక చర్యలు ఆశించినంత మేర సాగడం లేదని బాధితులు ఆరోపించారు. ఎక్కడ చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తుండడం, వాటి ముందు కూర్చొని బాధితులు తమ వారి కోసం రోదిస్తుండడం అందరినీ కలచి వేస్తోంది. భూకంప కేంద్రం మొరాకో నుంచి 72 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ పశ్చిమంలోని మారాకేశ్​లో గుర్తించినట్లు అమెరికన్​ జియోలాజికల్​సర్వే పేర్కొంది. మరోవైపు లక్షలాది మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.120 సంవత్సరాల తరువాత ఇంత భయంకర భూకంపం మొరాకోలో సంభవించింది. అల్​హౌజ్​ప్రావిన్స్​లో ఎక్కువగా 1,293 మంది మృతి చెందారని, నైరుతి మొరాకో టరౌడాంట్​లో 400 మందికి పైగా మరణించారని అధికారులు ప్రకటించారు. గాయపడ్డవారిలోనూ చాలామంది పరిస్థితులు విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భూకంపం కారణంగా మొరాకో ప్రభుత్వం జాతీయ సంతాప దినాలుగా మూడు రోజులు ప్రకటించింది. 

వివిధ దేశాధినేతల సంతాపం

జీ20 సదస్సులో కూడా పలు దేశాధినేతలు భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సానుభూతిని ప్రకటించారు. అదే సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కూడా భూకంపై సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందని యూఎన్​ ప్రతినిధి తెలిపారు. మొరాకో భూకంపంపై ఆ దేశ రాజు మొహమ్మద్​విపత్తులో తమ సర్వస్వం కోల్పోయిన వారి కోసం వెంటనే సహాయ కమిషన్​ను ఏర్పాటు చేయాలని, వారికి అన్ని విధాలా తోడ్పాటునందించాలని అధికారులను ఆదేశించారు. భూకంపం సంభవించిన ప్రాంతం అట్లాస్​కొండలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ భూకంపం వచ్చే సూచనలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు. ఇజ్రాయిల్, ఫ్రాన్స్, భారత్, టర్కీ, అమెరికా, యూఎన్, యూఎన్​ఓ సభ్యదేశాలు మొరాకోకు సహాయ సహకారాలందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఆయా దేశ ఆర్మీ, వస్తువులు, తినే పదార్థాలతో కూడిన బృందాలు బయలుదేరాయి.