పార్లమెంట్​సమావేశాల్లో  కేంద్రం ఎజెండా ఏంటి?

పార్లమెంట్​సమావేశాల్లో  కేంద్రం ఎజెండా ఏంటి?
  • ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ 
  • ఎజెండాలో ఉండాల్సిన అంశాలపై సూచనలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్​సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంగా.. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ నెలలో కేంద్రం ప్రత్యేక పార్లమెంట్​సమావేశాలకు పిలుపునివ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు? ఇందులో ఏం చర్చిస్తారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడంతో మరింత ఆసక్తి నెలకొంది. 
 
మోడీకి సోనియా సూచనలు..
ప్రత్యేక పార్లమెంట్​సమావేశాల సందర్భంగా ఎజెండాలో ఉండాల్సిన అంశాలను సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా సూచించారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఎజెండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే సమావేశాల ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని సోనియా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల తేదీలను ఖరాలు చేశారన్న సోనియా.. సమావేశాల ఎజెండా ఏంటో ఎవరికీ కనీస అవగాహన కూడా లేదని తెలిపారు. మొత్తం ఐదు రోజుల పాటూ ప్రభుత్వ ఎజెండాకే కేటాయించినట్లు తమకు తెలిసిందని, అయితే ఆ సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని కోరుతున్నట్లు ఆమె తన లేఖలో వెల్లడించారు.  
 
జమిలి ఎన్నికల కోసమేనా..?
అదానీ గ్రూప్‌పై వస్తున్న అక్రమ ఆరోపణలు, మణిపూర్‌ హింసాత్మక ఘటనలు, దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణనపై చర్చ చేపట్టాలని లేఖలో ప్రధానిని సోనియా గాంధీ కోరారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై కూడా చర్చించాలన్నారు. అయితే జమిలి ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.