ద్రవ్యోల్బణం కట్టడికి  కలిసి పని చేద్దాం

ద్రవ్యోల్బణం కట్టడికి  కలిసి పని చేద్దాం
  • లాభం కోసం పాకులాడితే ఒడుదొడుకులు తప్పవు
  • సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తోనే అభివృద్ధి 
  • ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యం, ధ్యేయం అవసరమని, స్వీయ అభివృద్ధి కోసం లేదా హోదా, పవర్ తదితర సొంత లాభాల కోసం పాకులాడితే చిన్నపాటి ఒడుదొడుకులు కలవరపెడతాయని పేర్కొన్నారు. త్వరలో జీ–20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనన్న నేపథ్యంలో ప్రధాని బుధవారం వివిధ అంశాలపై మాట్లాడారు.  
 
మిషన్ కోసం పనిచేస్తే ఫలితం ఆశించారు..
ఒక వ్యక్తి ఒక మిషన్ కోసం పని చేసినప్పుడు, ఫలితంతో సంబంధం లేకుండా కష్టపడతారు. వ్యకిగత లాభాలు ఆశించరు. నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టడానికి బదులుగా ప్రపంచంలో మార్పు తీసుకురావడంపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తారని ప్రధాని మోడీ తెలిపారు. జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకుల వల్ల అంత తేలికగా చలించరు. ఎందుకంటే వారి పని వారికంటే ముఖ్యమని వారికి తెలుసు.’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో గొప్ప విజయాలు సాధించే సత్తా ఉందని, వారి సామర్థ్యాన్ని వెలికితీసే ఒక వేదిక అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. "అలాంటి ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమే నా ధ్యేయం.. అదే నన్ను ఉత్సాహంగా ఉంచుతుంది. ఒడుదొడుకులు నన్ను ప్రభావితం చేయలేవు’ అని మోడీ చెప్పారు. దేశం గత తొమ్మిదేళ్లుగా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ విధానాన్ని అనుసరిస్తోందని అన్నారు.
 
వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ 
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని, ఎకానమీ పరంగా ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉన్న అమెరికా, చైనాను ఎదుర్కోవడానికి భారత్ ప్రణాళిక రచిస్తోందని మోడీ పేర్కొన్నారు. ఈ క్రమంలో జీ20 సదస్సుకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో భారత్‌ ప్రపంచంపై తనదైన ముద్ర వేయనుందన్నారు. 
 
ఆతిథ్యం.. ఇదే తొలిసారి
జీ–20 దేశాల 18వ సమావేశం న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ శిఖరాగ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. రష్యా నుంచి విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా నుంచి ప్రధాని లీ కియాంగ్ రానున్నారు.