ఫేస్​బుక్​నిలిపివేస్తాం

ఫేస్​బుక్​నిలిపివేస్తాం
  • కర్ణాటక హైకోర్టు హెచ్చరిక

కర్ణాటక: కర్ణాటక హై కోర్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాలో ఓ భారతీయుడ్ని అరెస్టు చేసిన విషయంపై స్పందించిన హైకోర్టు.. భారత్‌లో ఫేస్‌బుక్ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరించింది. తన భర్తను జైలు నుంచి విడిపించాలని కోరుతూ అతని భార్య చేసిన పిటీషన్‌పై స్పందించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ పిటీషన్‌లో ఉన్న వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరుకు సమీపంలో కవిత అనే మహిళ తన పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఆమె భర్త శైలేష్ కుమార్ అనే వ్యక్తి(52) గత 25 ఏళ్లుగా సౌది అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొచ్చినప్పుడు.. ఆమె భర్త ఈ చట్టాలకు మద్దతిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరు మీద ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు. అందులో సౌది అరేబియా రాజు, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అభ్యంతకర పోస్టులు చేశారు.దీంతో   శైలేష్ కుమార్‌ను సౌదీలో అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలటూ ఆదేశించింది. మంగళూరు పోలీసులు కూడా ఈ కేసుపై సరైన విచారణ చేసి..నివేదికను సమర్పించాలంటూ ఆదేశించింది. అలాగే వారం రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టులో సమర్పించాలంటూ ఫేస్‌బుక్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌ సేవలను భారత్‌లో నిలిపివేసే ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించింది. జూన్ 22 కు తదుపరి విచారణను వాయిదా వేసింది.