బీఆర్​ఎస్ పై శివసేన ఫైర్​

బీఆర్​ఎస్ పై శివసేన ఫైర్​

ముంబై: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనపై శివసేన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్‌ మహారాష్ట్రకు వస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. ఉద్యమనేత, పోరాట యోధుడనే పేరున్న కేసీఆర్‌.. బీజేపీకి ఎందుకు సరెండరవుతున్నారో అర్థం కావడం లేదని రౌత్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండరీపూర్‌లోని విఠోబాపై కేసీఆర్‌‌కు ఎప్పుడు భక్తి మొదలైందని ప్రశ్నించారు. అంత భారీ వాహనశ్రేణితో వచ్చి పండరీపూర్‌లో బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్‌ను ప్రశ్నించారు సంజయ్‌ రౌత్‌. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అనే అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారాయన. మహారాష్ట్రలోని పండరీపూర్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. రుక్మిణీ సమేత విఠలేశ్వరుడి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో సర్కోలి గ్రామంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే కేసీఆర్‌ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. సభ అనంతరం మధ్యాహ్నం తుల్జాపూర్‌ భవానీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.