పాలమూరులో భయపెడుతున్న సింహం

పాలమూరులో భయపెడుతున్న సింహం
  • సింహం చీల్చేదెవరి ఓట్లు

ముద్ర, మహబూబ్​నగర్​:-రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు రోజుల్లో పోలింగ్​ జరుగునున్నది. ఈ సమయంలో ఒక్కో సెగ్మెంట్​లో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో చీలిక ఓట్లు భయపెడుతున్నాయి. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పోటీ చేస్తున్న మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో ఉద్యమకారుడు, ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​ నుంచి బరిలోకి దిగిన మున్నూరు రవి ఏ వర్గం ఓట్లను చీల్చుతారనేది ఉత్కంఠగా మారింది. బీఆర్​ఎస్​లోకి ఉద్యమనేతలు లోపాయికారికంగా రవికి మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​పై వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతలు కూడా రవికి సపోర్ట్​ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రవి వైపు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సైలంట్​గా ప్రచారం చేసుకుంటున్న మున్నూరు రవి ఇప్పుడు ఎవరి ఓట్లు చీల్చుతారనేది ప్రధాన పార్టీలకు భయం పట్టుకున్నది. సింహం గుర్తుతో పోటీ చేస్తున్న రవి.. ఇటు కాంగ్రెస్​, అటు బీఆర్​ఎస్​ ఓట్లకు గండి కొడుతారనే ప్రచారం జరుగుతున్నది.