ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకు అవగాహన కల్పించిన  సీఐ కృష్ణ.

ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులకు అవగాహన కల్పించిన  సీఐ కృష్ణ.

ముద్ర, లక్షేట్టిపేట : పోలీసులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల రక్షణ కోసమే ఉన్నారని లక్షేట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ లో "మహిళల భద్రత -- పోలీసుల బాధ్యత" అనే అంశం పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.... మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే 100 నెంబర్ కు డయల్ చేయడం లేదా స్థానిక పోలీసులను సమాచారమివ్వాలన్నారు. మహిళల భద్రత పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్లు ఆయన వివరించారు.  సైబర్ నేరాలు జరుగుతున్న తీరు వాటిని ఎలా నివారించవచ్చో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, క్షణికవేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. విద్యార్థులు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఏమి తోచని పరిస్థితిలో చివరగా పోలీసులను సంప్రదిస్తే సొంత కుటుంబ సభ్యులలాగా తమ సహకారం అందిస్తామని సీఐ ఆవేదనతో తెలిపారు. మంచి పౌరులుగా రాణించాలంటే మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత గంజాయి, మద్యం లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు సీఐ, ఎస్సై, ప్రిన్సిపాల్ లకు రాఖీలు కట్టి రక్ష బంధన్ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా, ఎస్సై ఎస్ లక్ష్మణ్, ఏ ఎస్సై రాజేందర్, అధ్యాపకులు,అధ్యాపకేతర,  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.