అన్నదాతలకు  తీపి కబురు

అన్నదాతలకు  తీపి కబురు
  • పలు పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం
  • సాధారణ వరి క్వింటాలుకు రూ.143, ఏ గ్రేడ్​కు 163 పెంపు 
  • పల్లీలకు రూ.527, పెసర పంటకు రూ.803 
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి 


న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​చెప్పింది. పలు రకాల పంటలకు మద్దతు ధరను పెంచింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వివిధ పంటల మద్దతు ధరలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి ఈమేరకు వివరాలు వెల్లడించారు. 2023, 24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచినట్లు వెల్లడించారు. వరి క్వింటాలుకు రూ.143, పెసర పంట క్వింటాలుకు రూ.803, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,040 నుంచి రూ.2,183కు పెంచినట్లు తెలిపారు. పెసర పంట క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచినట్లు గోయల్​వెల్లడించారు.

మంత్రివర్గం ఆమోదించిన ధరలు..
సాధారణ వరి క్వింటాలుకు రూ.2,040 ఉండగా రూ.2,183కు పెంచారు. గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,060 నుంచి రూ.163 పెంచి, రూ.2,223 చేశారు. హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు. రాగులు క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. వేరుశనగ క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.