జీపీగా ఉన్న ములుగును జిల్లాగా మార్చాం

జీపీగా ఉన్న ములుగును జిల్లాగా మార్చాం

  • మెడికల్ కాలేజీ మంజూరు చేశాం
  • -రూ.133 కోట్లతో ప్రభుత్వ భవనాలు 
  • 17 వేల ఎకరాలకు పోడు పట్టాలు చేస్తాం
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
  • 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్న

ముద్ర ప్రతినిధి, వరంగల్ : గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా, జిల్లాగా మార్చి మెడికల్ కాలేజీ మంజూరు చేసి ఏజెన్సీ కేంద్రాన్ని అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్​అన్నారు. బుధవారం ఆయన ములుగు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ములుగును అభివృద్ధి పథంలో నిలిపామన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా కేంద్రంగా మార్చామని వెల్లడించారు. జిల్లా కేంద్రం అయ్యేవరకు గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును జిల్లా స్థాయిలో ఉండేవిధంగా జీపీ నుంచి మున్సిపాలిటీగా మార్చి అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బస్సు డిపో, వివిధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసం రూ.133.5 కోట్లతో లాంఛనంగా శంకుస్థాపనలు చేశామన్నారు. కొత్తగా 2 మండలాలను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్​తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానాలను ఉన్నతీకరించామన్నారు. జిల్లాలో పోడు రైతులకు 17వేల హక్కు పత్రాలను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మంత్రులు మహమ్మద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత మాట్లాడారు. బహిరంగ సభకు ముందు మంత్రులు సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, సేవాలాల్ భవన్ లతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 

రూ.150 కోట్లతో శంకుస్థాపనలు
మినిస్టర్​కేటీఆర్ ములుగు జిల్లాలో రూ.150 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి మహమ్మద్ అలీతో కలిసి హెలికాప్టర్​లో ములుగు కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవనానికి సుమారు రూ.38.5 కోట్లతో శంకుస్థాపన చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల పక్క భవనాలు, మోడల్ బస్టాండ్, సేవాలాల్ భవన నిర్మాణాలకు సైతం పునాదిరాయి వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వల్ల రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.