సైఫ్​ వేధింపుతోనే ప్రీతి ఆత్మహత్య

సైఫ్​ వేధింపుతోనే ప్రీతి ఆత్మహత్య
  • తేల్చేసిన పోలీసులు
  • 970 పేజీలతో చార్జ్​షీట్​

ముద్ర, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్యకు సైఫ్​ ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. మూడున్నర నెలల సుదీర్ఘ విచారణ తర్వాత వరంగల్​ పోలీసులు చార్జ్​షీట్​ దాఖలు చేశారు. మొత్తం 70 మందిని విచారించారు. 970 పేజీలతో చార్జ్​షీట్​ నమోదు చేశారు. ప్రీతి ఆత్మహత్య తర్వాత ఆమె గదిని బుధవారం పోలీసుల సమక్షంలో తెరిచారు. ఆమెకు సంబంధించిన మెటీరియల్​తల్లిదండ్రులకు అప్పగించారు. కులం పేరు ప్రస్తావించడంతో పాటు ర్యాగింగ్ చేయడంతో ప్రీతి డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రీతి 2022 నవంబర్‌లో కేఎంసీలో జాయిన్‌ అయినప్పటి నుంచి సైఫ్‌ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు వివరించారు. భరించలేని ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, 26వ తేదీన నిమ్స్‌లో కన్నుమూసిందని పేర్కొన్నారు. ఏసీపీ బోనాల కిషన్​ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించి చార్జ్​షీట్​ దాఖలు  దాఖలు చేశామని సీపీ రంగనాథ్​ప్రకటించారు. 

రూం ఓపెన్​
ప్రీతి మృతిపై అనేక అనుమానాలు, ఆందోళనలు వక్తమైన నేపథ్యంలో పోలీసులు ఈ రూమ్‌ని సీజ్ చేసి, విచారణ చేపట్టారు. ఇప్పుడు కేఎంసీకి కొత్త విద్యార్థులు వస్తుండటంతో, ప్రీతి రూమ్ ఖాళీ చేయాలని కుటుంబ సభ్యులకు కేఎంసీ అధికారులు సూచించారు. దీంతో ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ పోలీసులను ఆశ్రయించి వారి సమక్షంలో ప్రీతి రూమ్ ఓపెన్ చేశారు. ప్రీతికి చెందిన స్టడీ మెటీరియల్స్‌తో పాటు మెడిసిన్, ఇతర సామాగ్రిని తీసుకెళ్ళారు.