బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు...

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు...

ముద్ర,తెలంగాణ:- బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని బీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు.

ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకొని దాడి చేశారు. ఏపీ, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు గుర్తించి సీజ్‌ చేశారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌ హౌస్‌ సమీపంలో బెంజ్‌, జాగ్వార్‌, ఆడీ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. రేవ్‌ పార్టీలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న బెంజ్‌ కారు సైతం లభ్యమైనట్లు సమాచారం. పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.