మేం బలవంతం చేయలేదు

మేం బలవంతం చేయలేదు
  • కవితకు నోటీసుల తర్వాతే పిళ్లై స్టేట్​మెంట్ విత్ డ్రా
  • పిళ్లై పిటిషన్ పై వాదనలు వినిపించిన ఈడీ
  • విచారణ సీసీ ఫుటేజీలు ఉన్నాయి
  • మరోసారి కస్టడీకి అనుమతించాలి : కోర్టును కోరి ఈడీ
  • పిళ్లైకి మరో మూడు రోజుల కస్టడీకి అనుమతి
  • రేపట్నుంచి బుచ్చిబాబుతో సహా విచారణ
  • 16న కవిత విచారణకు ముందు కీలక పరిణామాలు 

ముద్ర, తెలంగాణ బ్యూరో : తాము బలవంతం చేసి అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం తీసుకోలేదని, వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అన్ని నిబంధనలు పాటించామని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తన స్టేట్​మెంట్ ను వెనక్కి తీసుకోవాలనే పిటిషన్ తోపాటు పిళ్లై కస్టడీని పొడిగించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్​పైనా రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో చాలా కీలక సమయంలో పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరణ కోసం అప్లికేషన్ దాఖలు చేశారని, పిళ్లై విచారణకు సంబంధించి సీసీటీవీ పుటేజీ, ఆధారాలు అన్నీ ఉన్నాయని ఈడీ తరుపు న్యాయవాది ఈ సందర్భంగా వెల్లడించారు. విచారణ సమయంలో పిళ్లైతోపాటు అతని న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనలను వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాతే పిళ్లై తన స్టేట్​మెంట్ వెనక్కి తీసుకుంటామంటున్నారని తెలిపారు.


ముడుపుల వ్యవహారంలో పిళ్లైది ప్రధాన పాత్ర.. 
మొదటిసారి గతేడాది సెప్టెంబర్​18న పిళ్లై స్టేట్ మెంట్ రికార్డు చేశామని, ఆయనను 29 సార్లు విచారణ చేశామని, ముడుపుల వ్యవహారంలో పిళ్లై ప్రధాన పాత్ర పోషించారని కోర్టుకు స్పష్టం చేశారు. ఆయన కస్టడీని పొడిగించాలని కోర్టుకు విన్నవించగా ఈడీ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. మరో మూడు రోజులపాటు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలను కోర్టు ముందుంచారు. ఈ కేసులో ఇప్పటికే పిళ్లైను ఈడీ అధికారులు 29 సార్లు విచారణకు పిలిచి 11 సార్లు స్టేట్ మేంట్ రికార్డు చేశారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. పిళ్లై ఇప్పటికే విచారణకు అన్ని విధాలా సహకరించారని, కేసు విచారణకు 36 సార్లు హాజరయ్యారని కోర్టుకు వివరించారు. ఒకవేళ ఇతర నిందితులతో కలిపి పిళ్లైను ప్రశ్నిస్తే విచారణలో న్యాయవాది ఉండాలని పిళ్లై తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేవలం హోటల్ రికార్డులతో లిక్కర్ కేసు ఆపాదించాలని చూస్తున్నారన్నారు. అనంతరం ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిళ్లై, బుచ్చిబాబు కలిసి లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారని కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్లైను, బుచ్చిబాబును కలిపి ప్రశ్నించాల్సి ఉందని, న్యాయవాదుల సమక్షంలో పీఎంఎల్ఎ సెక్షన్ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదని స్పష్టం చేశారు. 2022 సెప్టెంబర్​18న పూర్తి స్టేట్​మెంట్ నమోదు చేశామని, రెండు, మూడో దఫా ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వివరాలు ఖరారు చేశారని తెలిపింది. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్లలో అవే విషయాలను ఎలా కన్ఫర్మ్ చేస్తారని ఈడీ ప్రశ్నించింది.

కవితను విచారణకు పిలిచినప్పుడు స్టేట్​మెంట్ మార్చుకున్నారు..
ఈ కేసులో బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత తరుపున సౌత్ గ్రూపునకు పిళ్లై ప్రధానంగా వ్యవహరించారని, కవితకు బినామీగా ఉన్నట్లు పలుమార్లు స్పష్టం చేశారన్నారు. దీంతో తాము కవితకు నోటీసులు జారీ చేసిన తర్వాత పిళ్లై అనూహ్యంగా తన స్టేట్మెంట్ మార్చుకున్నారని, అలా ఎందుకు చేశారో తెలుసని, ఒక బలమైన వ్యక్తిని విచారణకు పిలిచామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. కవితను విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని వివరించిందన్నారు. పిళ్లైని ఇంకా విచారించాల్సి ఉందని న్యాయస్థానం ముందు కోరింది. అంతేకాకుండా సౌత్ గ్రూపులో ఉన్న వారందరినీ విచారణ చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో మరో నిందితుడు బుచ్చిబాబును మార్చి 9న ఈడీ విచారణకూ రావాలని కోరామని, బుచ్చిబాబు మార్చి 13 వరకు సమయం కోరారని, బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని విచారణ చేయాల్సి ఉందని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. అందువల్ల పిళ్లై కస్టడీని మార్చి 15 వరకు పొడిగించాలని ఈడీ కోరింది. ఈ కేసులో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైని వారం రోజుల ఈడీ కస్టడీ సోమవారానికి ముగియడంతో కస్టడీ పెంచాలని విన్నవించారు. ఇదే కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను శనివారం విచారణ చేసిన ఈడీ అధికారులు 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు.  

బుచ్చిబాబుకు నోటీసులు..
పిళ్లై కస్టడీని పొడిగించిన నేపథ్యంలో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసులో ఈడీ అధికారులు బుచ్చిబాబుతో పాటు ఇప్పటికే కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి  విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.