వెనక్కు తగ్గం.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు సాధించే వ‌ర‌కు విశ్రమించబోం- ఢిల్లీ దీక్షలో ఎమ్మెల్సీ కవిత

వెనక్కు తగ్గం.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు సాధించే వ‌ర‌కు విశ్రమించబోం- ఢిల్లీ దీక్షలో ఎమ్మెల్సీ కవిత

ముద్ర, తెలంగాణ బ్యూరో: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని, ఢిల్లీ గ‌డ్డ మీద చేప‌ట్టిన ధ‌ర్మ పోరాటం దిగ్విజ‌యంగా సాగిందని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలన్న డిమాండ్​తో ఆమె శుక్రవారం జంతర్​మంతర్​వద్ద ఒకరోజు దీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య కాదన్నారు. మహిళల అభివృద్ధి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న మోడీ.. బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని ప్రశ్నించారు. మోదీ స‌ర్కార్ త‌లుచుకుంటే ఈ బిల్లు పాస‌వుతుందన్నారు. 


మహిళలు రాజకీయాల్లోకి రావొద్దనే..
మహిళలు రాజకీయాల్లోకి రావద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తొక్కిపెడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ పాలనను ప్రశ్నించేవారిపై ఈడీ, సీబీఐ కేసులు పెడుతోందని ఆరోపించారు. మహిళా బిల్లు కోసం తాను దీక్ష చేపట్టనన్నట్లు ప్రకటించిన వెంటనే దీక్షకు భగ్నం చేసేవిధంగా నోటీసులు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబ‌ర్‌లో పార్లమెంట్ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు బిల్లు కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మ‌హిళా బిల్లు చారిత్రక అవ‌స‌రమని, ఈ విషయమై రాష్ట్రప‌తికి కూడా తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  దీక్షకు మ‌ద్దతు తెలిపిన ఢిల్లీ మ‌హిళా నేత‌లు, విద్యార్థి నేత‌లు, ఇతర లీడర్లకు కృత‌జ్ఞత‌లు చెప్పారు. అనంతరం సీపీఐ నేత నారాయణ, ఎంపీ కేశవరావు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. కవితకు మద్దతుగా ఆప్ నేత‌లు సంజ‌య్ సింగ్, చిత్ర స‌ర్వార‌, న‌రేశ్​గుజ్రాల్(అకాలీద‌ళ్‌) శివ‌సేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా(పీడీపీ), ష‌మీ ఫిర్దౌజ్ (నేష‌న‌ల్ కాన్ఫరెన్స్‌), సుస్మితా దేవ్(టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), కె.నారాయ‌ణ (సీపీఐ), సీతారాం ఏచూరి(సీపీఎం), పూజ శుక్లా(ఎస్‌పీ), శ్యాం రాజ‌క్ (ఆర్ఎల్‌డీ), క‌పిల్ సిబ‌ల్‌, ప్రశాంత్ భూష‌ణ్ స‌హా ప‌లు విప‌క్ష పార్టీల నేత‌లు, ప్రతినిధులు దీక్షలో పాల్గొన్నారు.


ఇచ్చిన మాట తప్పిన బీజేపీ: ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ 
మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, అయినా మోదీ  ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను బీజేపీ తప్పిందని విమర్శించారు. ఈ పోరాటం ఇప్పటిది కాదని, కొన్ని దశాబ్దాలనాటిదని గుర్తు చేశారు. అకాలీదల్ నేత నరేశ్ గుజ్రాల్​మాట్లాడుతూ ఇన్నేండ్లయినా మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయమని అన్నారు. పార్లమెంటులో మెజారీటీ ఉంటే మహిళా బిల్లును ఆమోదింపజేస్తామని బీజేపీ మొదటిసారి 2014 ఎన్నికల సమయంలో, 2019లో మరోసారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. మినిస్టర్​సత్యవతి రాథోడ్​మాట్లాడుతూ మహిళలు వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని విమర్శించారు. మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని విమర్శించారు.