సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం  మంత్రి  కేటీఆర్‌

సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం  మంత్రి  కేటీఆర్‌

ముద్ర, తెలంగాణ బ్యూరో :  సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. 17న సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ లో జరిగే వేడుకల్లో పాల్గొంటారన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాలలో మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురువేస్తారని చెప్పారు. తెలంగాణ భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంబురంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవంపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని  వక్రీకరించి,  స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆనాటి చరిత్రతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో  తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయన్నారు.  ప్రతి అంశానికి మతాన్ని జోడించే విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలన్నారు.