ముగిసిన జీ20 సదస్సు

ముగిసిన జీ20 సదస్సు

ముద్ర, తెలంగాణ బ్యూరో : న్యూఢిల్లీలో రెండురోజుల పాటు జ‌రిగిన జీ-20 స‌ద‌స్సు ఆదివారం ముగిసింది. ర‌ష్యా -ఉక్రెయిన్ యుద్ధం నేప‌ధ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ జ‌రిగిన ప్రార్ధన‌ల‌తో స‌ద‌స్సు ముగిసిన‌ట్టు ప్రధాని న‌రేంద్ర మోదీ ప్రక‌టించారు. జీ20 స‌ద‌స్సు ముగిసిన‌ట్టు ప్రక‌టిస్తున్నానని, వ‌సుధైక కుటుంబానికి రోడ్‌మ్యాప్ దిశ‌గా మ‌నం ముందుకు సాగుతామ‌ని ఆకాంక్షిస్తున్నా అని మోదీ త‌న ముగింపు ఉప‌న్యాసంలో పేర్కొన్నారు.

జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు అధికార దండాన్ని  ప్రధాని మోదీ అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆయనను మోడీ అభినందించారు. స‌ద‌స్సులో చ‌ర్చించిన అంశాల‌పై సమీక్షించేందుకు ఈ యేడాది న‌వంబ‌ర్ మాసాంతంలో వ‌ర్చువ‌ల్ భేటీ జ‌ర‌గాల‌ని మోదీ ప్రతిపాదించారు. స‌ద‌స్సులో ముందుకొచ్చిన సూచ‌న‌లు, అంశాలపై చ‌ర్యలు, పురోగ‌తిని స‌మీక్షించాల్సిన అవ‌సరం ఉందని పేర్కొన్నారు. కాగా, ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత సభ్య దేశంగా జీ20 స్వాగతించింది.