ప్రజాస్వామ్యం కాపాడాం..

ప్రజాస్వామ్యం కాపాడాం..
  • కాబట్టే ప్రధాని అయ్యారు
  • మోడీకి ఖర్గే చురకలు

ఢిల్లీ: చాలా ఏళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాం కాబట్టే మీరు నేడు ప్రధాని కాగలిగారని తాము ఆ పనిచేయకుంటే మీరు అధికారంలోకి వచ్చేవారే కాదని కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీ, బీజేపీపై విమర్శలు సంధించారు. కానీ నేడు తమ పాలనకు విరుద్ధంగా బీజేపీ పాలన నడుస్తోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, జైలులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గురువారం ఖర్గే ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో మహిళా కాంగ్రెస్​ బ్లాక్​ అధ్యక్షులు, ఆఫీస్​ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఓ వైపు దేశంలో మహిళలపై దాడులు పెచ్చుమీరుతుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంభించడం ఎంతమేరకు సమంజసమన్నారు. దేశంలో అసలు మహిళలకు, పౌరులకు స్వేచ్ఛ ఉందా? అని ప్రశ్నించారు. 

2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్​ చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించి దేశంలోని పౌరులకు రూ. 15 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయలేదన్నారు. దేశ ప్రధాని ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా? అని తప్పుడు వాగ్దానాలు చేస్తారా? అని నిలదీశారు. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదన్నారు. బీజేపీలో అలాంటి నాయకులెవరున్నారని ప్రశ్నించారు. గాంధీజీ ప్రపంచానికి, దేశానికి శాంతి సందేశాన్ని బోధిస్తూ దేశాన్ని స్వాతంత్ర్య తీరాలకు చేర్చారని ఆయన ఏ పదవిని ఆశించలేని మహానుభావుడని కొనియాడారు. కొందరు మతోన్మాదులు ఆయన సేవలను కూడా విమర్శలపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్​హింసలో విపక్షాలు, కాంగ్రెస్​ పార్టీ నేతలు అందరూ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వచ్చారన్నారు. కానీ ప్రధానికి మాత్రం అక్కడికి ఎందుకు వెళ్లడం లేదో సూటిగా చెప్పాలన్నారు. తప్పించుకుతిరుగుతున్నారని ఆరోపించారు. అక్కడ హింస తగ్గడం ప్రధానికి ఇష్టం లేదేమోనని ఆరోపించారు. సభలో ఈ అంశంపై చర్చ జరగాలని కోరినా ఏ ఒక్క రోజు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. 2024లో కూడా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని మోదీ ఆగస్టు 15న చెప్పారు. కానీ ప్రధాని మోడీ తీరు చూస్తుంటే అతను ఖచ్చితంగా వచ్చే యేడు అతని ఇంటిమీద నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాడని, ప్రజలు ఆయన్ను, పార్టీని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.