మోడీకి అధికారంపైనే మమకారం

మోడీకి అధికారంపైనే మమకారం
  • బీజేపీపై సీఎం కేజ్రీవాల్​ఆగ్రహం

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ చివరి రోజు ఆప్​ అధ్యక్షుడు, సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ గురువారం బీజేపీపై దుమ్మెత్తి పోశారు. మణిపూర్​హింస తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ ప్రవర్తిస్తోందన్నారు. మరోవైపు ఢిల్లీ అధికారంపై మాత్రం ప్రధానికి మమకారం ఉందని ఎద్దేవా చేశారు. అదే సమయంలో భారత భూభాగాన్ని రహస్యంగా చైనాకు అప్పగించే ఒప్పందం కుదిరిందని కేజ్రీవాల్​ ఆరోపించారు. కేజ్రీవాల్​ఆరోపణలు సభలో బీజేపీ సభ్యులు అరుపులతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో తీవ్ర గందరగోళం నెలకొనగా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్​ చేశారు. మణిపూర్​ గొడవల్లో కేంద్రం సరైన చర్యలు తీసుకోకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎంతోమంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారన్నారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

సహాయక శిబిరాల్లో వారిని సౌకర్యాల లేమి వెన్నాడుతోందన్నారు. ఈ అంశంపై విదేశాలు సైతం ప్రశ్నిస్తుంటే ప్రధాని మోడీ శిలావిగ్రహంగా మౌనంగా ఉండడం ఏంటని నిలదీశారు. మణిపూర్‌లో 6,500 ఎఫ్‌ఐఆర్‌లు, 150 మందికి పైగా అమాకుల మరణం, మహిళలను వివస్ర్తలను చేసి అవమానించడం ఇవన్నీ చూసి కూడా ప్రధాని మనస్సు చలించడం లేదని దుయ్యబట్టారు. మరోవైపు గాల్వన్​ఘటన అనంతరం ప్రధాని మోడీ చైనాతో చర్చల తరువాత ఎవ్వరికీ తెలియకుండా లోలోపలే భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. నూహ్​లో అల్లర్లపై కూడా ప్రధాని మౌన ముద్ర వీడడం లేదని సీఎం కేజ్రీవాల్​ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.