మేడారం జాతర ఏర్పాట్లలో ఏఐ!
- భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
- ఏఐ సహా వివిధ సాంకేతికతలను వినియోగిస్తున్న వైనం
- రద్దీ నియంత్రణ, వాహన రాకపోకలపై నిఘా కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉన్న కెమెరాల ఏర్పాటు
- జాతరలో వివిధ ప్రాంతాల సమాచారంతో యాప్ విడుదల చేయనున్న ప్రభుత్వం
తెలంగాణాలోని మేడారం జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ దిశగా అత్యాధునిక సాంకేతికతలను కూడా వినియోగిస్తుంది. ఏకంగా ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటోంది.
ఏఐ వినియోగం ఇలా..
రద్దీ నియంత్రణ కోసం కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్ రూంకు అనుసంధానిస్తున్నారు. వీటి ద్వారా చదరపు మీటరులో నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలను గుర్తించి, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్ కౌటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు.
మేడారం ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ రూంకు అనుసంధానమై ఉండే వీటి ద్వారా 24 గంటలూ నిఘా పెడతారు. నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ప్రత్యేక సిబ్బంది సాయంతో వీటిని నిర్వహిస్తూ ఆయా ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచుతారు.
మేడారంలోని పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జాతరలో తప్పిపోయిన వారి వివరాలను కూడా తెరలపై ప్రసారం చేస్తారు. వాహనాల పార్కింగ్ కోసం 1400 ఎకరాల మేర విస్తరించి ఉన్న 33 పార్కింగ్ స్థలాలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ 6 వేల బస్సులను నడపాలని నిర్ణయించింది.