ఇంజిన్ లేకుండా  ముందుకెళ్లిన రైలు బోగీలు

ఇంజిన్ లేకుండా  ముందుకెళ్లిన రైలు బోగీలు
  • బిహార్‌లోని కటిహార్‌ జిల్లాలో ఘటన
  • ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

గుహవాటి: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఓ రైలు రెండుగా విడిపోయి.. ఇంజిన్ లేకుండానే కోచ్‌లు చాలా దూరం అలాగే ప్రయాణించాయి.ఈ ఘటన బిహార్‌లోని కటిహార్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం జరగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అసోంలోని గువాహటి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్​నుంచి దాదాపు 10 బోగీలు విడిపోగా.. మిగతా కోచ్‌లతో రైలు మాత్రం కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. బిహార్‌ బెంగాల్‌ సరిహద్దులోని నార్త్‌ దినాజ్‌పుర్‌ సమీపంలో కటిహార్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న దల్ఖోలా -సూర్యకమాల్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. బోగీలను వదిలి ఇంజిన్ వెళ్లిపోతుండడంతో ప్రయాణికులు భయపడిపోయారు. చాలా మంది కిందికి దూకేశారు. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే సమయంలో ఎదురుగా ఏ రైలూ రాకపోవడం కూడా కలిసొచ్చింది. లేదంటే మరో బాలాసోర్‌‌ ప్రమాదం సంభవించేది. ఈక్రమంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసిన అధికారులు.. ఇంజిన్‌తో కోచ్‌లను అనుసంధానించారు. రైలులో సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.