రాజస్థాన్ బీజేపీలోనూ అసమ్మతి మంటలు - పలుచోట్ల తప్పని రెబెల్స్ బెడద

రాజస్థాన్ బీజేపీలోనూ అసమ్మతి మంటలు - పలుచోట్ల తప్పని రెబెల్స్ బెడద

ఉదయ్ పూర్: భారతీయ జనతా పార్టీకి మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్ లోనూ రెబెల్స్ బెడద తప్పడం లేదు. రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీలో అసమ్మతి మంటలు ఎగిసిపడుతున్నాయి. టిక్కెట్లు ఆశించి దక్కని నాయకులు ఎక్కడికక్కడ నిరసనలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ లోని జైపూర్, రాజ్ సమంద్, చిత్తోర్ గఢ్, అల్వార్, బుండి, ఉదయ్ పూర్ లో అసమ్మతి భగ్గుమంటోంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను పార్టీ హైకమాండ్ విడుదల చేసిన వెంటనే ఒక వెల్లువలా అసమ్మతి పెల్లుబుకింది. 

     రాజ్ సమంద్లో పార్టీ కార్యాలయాన్ని అసమ్మతి శ్రేణులు ధ్వంసం చేశాయి. చిత్తోర్ గఢ్ లో పార్టీ అధ్యక్షుడు సీపీ జోషి ఇంటిపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. రాజ్ సమంద్ నియోజకవర్గం నుంచి దీప్తి మహేశ్వరి నామినేషన్ దాఖలు చేయడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి ఆందోళన మొదలయ్యింది. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన పార్టీ శ్రేణులు అక్కడి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు ఎన్నికల సామగ్రిని చించి కార్యాలయం బయట పడవేశారు. అలాగే పార్టీ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన క్యాంప్ నిర్వహిస్తున్నారు. 
    చిత్తోర్ గఢ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి హింసాత్మకమైన నిరసనను పార్టీ శ్రేణుల నుంచి ఎదుర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే చంద్రభాన్ సింగ్ ఆక్యాకు టిక్కెట్ నిరాకరించడంతో జోషికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు జోషి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. చిత్తోర్ గఢ్ లోని గుల్షన్ గార్డెన్ లో ఆక్యా మాట్లాడుతూ “ఇంకా రెండు రోజుల సమయం ఉంది. పార్టీ నాకు టిక్కెట్ ఇవ్వకపోయినా, నేను ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం ” అని స్పష్టం చేశారు.

  ఇక ఉదయ్ పూర్ లో బీజేపీ అభ్యర్థిగా తారాచంద్ జైన్ నామినేషన్ వేయడాన్ని ఉదయ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పరస్ సింఘ్వీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిత్వం విషయంలో పార్టీ పున:సమీక్షించుకోకపోతే తీవ్రమైన పోటీని ఎదుర్కొని మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఆయన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా పై కూడా విరుచుకుపడ్డారు. ఉదయ్ పూర్ లో రాజకీయాలు అవినీతిమయమై పోవడానికి ఆయనే కారణమని ఆరోపించారు. 

    ఇక అల్వార్ నగరంలో వైశ్యులకు టిక్కెట్ ఇవ్వాలని ఆ వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి బీజేపీ టిక్కెట్ సంజయ్ శర్మకు కేటాయించడంతో అక్కడ నిరసనలు మొదలయ్యారు. వైశ్య వర్గానికి చెందిన భన్వారీలాల్ సింఘాల్ కు గతంలో రెండుసార్లు టిక్కెట్ కేటాయించగా ఆయన విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికలలో ఆయనకు కాకుండా సంజయ్ శర్మకు టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు రెండోదఫా కూడా సంజయ్ శర్మకే టిక్కెట్ ఇవ్వడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. 

    అలాగే సంగనేర్ ఎమ్మెల్యే అశోక్ లాహోటికి టిక్కెట్ నిరాకరించడంతో ఆయన మద్దతుదారులు స్థానిక బీజేపీ కార్యాలయం ఎదుట టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ఇక, సోము అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంలాల్ శర్మకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్వన్ బరాలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. బుండీ నియోజవర్గంలో అశోక్ డోగ్రా నామినేషన్ కు కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. పలువురు అసమ్మతివాదులు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలిపారు.  రాజస్థాన్లో 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ అధిష్ఠానం మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. జాబితా విడుదలైన మరుసటి రోజే ఏడుగురు అసమ్మతి నేతలు, వారి మద్దతుదారులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.