అమెరికా అభిమానానికి కృతజ్ఞుణ్ని

అమెరికా అభిమానానికి కృతజ్ఞుణ్ని
  • అమెరికా అభిమానానికి కృతజ్ఞుణ్ని
  • వైట్​హౌస్​వద్ద ఇంతమందిని చూడడం ఇదే ప్రథమం
  • ప్రధాని నరేంద్రమోడీ

వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ఉంటున్న 40 లక్షల మంది భారతీయులకు, 140 కోట్ల భారతీయులకు, అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మోడీ గురువారం రెండో రోజు అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా ఫస్ట్​లేడీ జిల్​ బైడెన్, అధ్యక్షుడు బైడెన్ ను వైట్​హౌస్​లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రధాని వైట్​హౌస్ వద్ద​ ప్రసంగించారు. మూడు దశాబ్దాల క్రితం ఓ సాధారణ వ్యక్తిగా తాను అమెరికాకు వచ్చానని, ఆ సమయంలో తాను వైట్​హౌస్​ను బయటనుంచే వీక్షించానన్నారు. ప్రధాని అయ్యాక చాలాసార్లు వైట్​హౌస్​కు వచ్చానని, కానీ ఇంత పెద్దమొత్తంలో భారతీయులు వైట్​హౌస్​కు రావడం ఇదే ప్రథమంగా చూస్తున్నానని మోడీ అన్నారు. అమెరికాలో ఉన్న భారతీయులు ఇరుదేశాల మైత్రి, అభివృద్ధికి నిజమైన శక్తులుగా ప్రధాని అభివర్ణించారు. భారత్​– అమెరికాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నారు. సమాజం, ప్రపంచం బాగుండాలన్నదే తమ ఉద్దేశమని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం వైట్​హౌస్​లో ఇరుదేశాల అధికార వర్గాలతో కలిసి పలు ఎగుమతులు, దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలపై చర్చలు నిర్వహించారు. రెండో రోజు ప్రధాని మోడీకి ‘స్టేట్​డిన్నర్​’ ఏర్పాటు చేశారు.

అమెరికా బైడెన్​నేతృత్వంలో ఇప్పటివరకూ ఇద్దరు ప్రధానులకే స్టేట్ డిన్నర్​కు అవకాశం లభించగా ఇప్పుడు వారి సరసన ప్రధాని మోడీ చేరారు. ప్రపంచంలో కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య, రక్షణ సంబంధాలు కీలకంగా నిలవనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా కొన్ని దేశాల్లో రక్షణ రంగ ఉత్పత్తులను గణనీయంగా పెంచుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్​ కూడా అత్యాధునిక రక్షణ రంగ ఉత్పత్తులను పెంచుకోవడంలో అమెరికా కీలకం కానుందని ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేశారు.