బీఆర్ఎస్ ఆర్థిక మూలాలపై బీజేపీ కన్ను

బీఆర్ఎస్ ఆర్థిక మూలాలపై బీజేపీ కన్ను

సిద్దిపేటపై ఐటి గురి
దాడులు ఎవరిపై?
ఇన్వెస్టిగేషన్ టీంలకు సమచారం

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆర్థిక మూలాలను మూసివేసి,
ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ అధిష్టానవర్గం కసరత్తులు  చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు రియల్ ఎస్టేట్ లావాదేవీలతో భారీగా ఆర్థిక వనరులు సమకూరుతున్నట్లు బీజేపీ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆదాయపన్ను శాఖను మేల్కొల్పి, వ్యాపారుల్లో భయాందోళనలు, కొనుగోలుదారులలో అయోమయం సృష్టించడం ద్వారా క్రయవిక్రయాల నిలుపుదల చేయవచ్చెనే స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ బడా వ్యాపారులపై కన్నేసి పెట్టిన ఐటీ అధికారులు.. తాజాగా
సిద్దిపేట జిల్లాపై దృష్టి సారించినట్లు సమాచారం. త్వరలో మూడు రంగాల వారిపై ఈ దాడులు కొనసాగనున్నాయని విశ్వసనీయ సమాచారం.
10 నుంచి 15 మంది బడా వ్యాపారుల బ్యాంకు లావాదేవీలు మొదలైనవన్నీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం కొందరు పన్ను ఎగవేత దారులను గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లింపు ఆర్డర్లను జారీ చేసి, పన్ను రాబట్టుకున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య నెలకొన్న వైరం దృష్ట్యా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారిపై ఐటీ దాడులు జరుగుతాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐటి దాడులు కొనసాగుతున్న తీరు ఇందుకు ఊతమిచ్చింది. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఇందుకు కారణం.

సుమారు నెలరోజుల క్రితం ఆదాయపన్ను శాఖ ఇన్ఫార్మర్ వ్యవస్థ సిద్దిపేటలో పర్యటించింది. అప్పుడు 100 మంది పై ఆరా తీస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ వారు సుమారు 40 మంది వివరాలు సేకరించి ఐటీ ఇన్వెస్టిగేషన్ టీం లకు సమాచారం అందించినట్లు తెలిసింది. రాజకీయ కోణంలో కాకుండా, చిన్న చితకా వ్యాపారుల జోలికి వెళ్లకుండా సుమారు 15 మంది పన్ను ఎగవేత దారుల లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణ రంగంలో ఉన్న డెవలపర్స్, బంగారం జువెలరీ వ్యాపారుల లావాదేవీలపై ఐటి ఇన్వెస్టిగేషన్ టీంలు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఐదారేళ్ల నుంచి సిద్దిపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
సుమారు 100 మంది దాకా ఈ రంగంలో లావాదేవీలు నిర్వహిస్తున్నా పట్టుమని పదిమంది కూడా సక్రమంగా ఆదాయపన్ను చెల్లించడం లేదు. రాష్ట్ర రాజధానికి చెందిన పలువురు డెవలపర్స్ ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయిస్తున్నారు . చాలామంది వీలైన మేరకు పన్ను ఎగవేస్తున్నారని తెలిసింది. 

ఈ ప్రాంతంలో అపార్టుమెంటుల నిర్మాణం, క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపల్ అధికారుల అండతో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యాపారులు వందల కొలది అపార్ట్మెంటులు అమ్ముతున్నా పన్ను చెల్లింపు విషయంలో నల్లపూసలవుతున్నారు. వారి పాన్ కార్డు, ఆధార్ కార్డుల లింకుతో, బ్యాంకు లావాదేవీలను గమనించి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

సిద్దిపేటలో కార్పొరేట్ రంగానికి సంబంధించిన జువెలరీ షాపులు వరుసగా తెరుచుకుంటున్నాయి. ఇక్కడ అధికంగా వ్యాపారం ఉండటమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో జ్యువలరీ రంగంపై కూడా ఐటీ ఇన్వెస్టిగేషన్ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

ఫిబ్రవరి నెలలో ఈ దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు అంతర్గతంగా ఐటీ సంబంధిత వర్గాలలో చర్చ జరుగుతోంది. అప్పటివరకు సమాచారాన్ని ఐటి ఉన్నతాధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.