రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు

రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు
  • 2,627 కి.మీ మేర లైన్ల నిర్మాణం
  • తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో గిరిజన ప్రాంతాలకూ కనెక్టివిటీ 
  • మరింత సులభతరం కానున్న ప్రయాణాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు దక్షిణ మధ్య రైల్వేశాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నెట్క్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసేందుకు రైల్వేశాఖ దృష్టి సారించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. 2,627 కి.మీ మేర కొత్త లైన్ల నిర్మించటంతో పాటు 2,588 కిలోమీటర్ల మేర రైల్వే విస్తరణ చేపట్టనుంది. ఈ మేర  రెండు, మూడు, నాలుగో లైన్లను మంజూరు చేసిన తుది సర్వే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ లైను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని మారుమూల, గిరిజన ప్రాంతాల కనెక్టివిటీకి దోహదపడనుంది. ఖనిజ సంపద ప్రాంతాలు, పారిశ్రామికప్రాంతాల మీదుగా ఈ లైన్‌ను రైల్వేశాఖ ప్రతిపాదించింది. 

డోర్నకల్‌ మిర్యాలగూడ మధ్య మరో లైన్.. 

ఇక డోర్నకల్‌ మిర్యాలగూడ మధ్య కూడా మరో రైల్వే లైను వేయనుంది. ఈ లైన్ ద్వారా నేలకొండపల్లితో పాటు హుజూర్‌నగర్‌, కోదాడ పట్టణాలకు కనెక్టివిటీ జరుగుతుందన్నారు. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, ఢిల్లీ మార్గాలతో అదనపు అనుసంధానం ఏర్పడనుందన్నారు. సింగరేణి కాలరీస్‌ నుంచి యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సులభంగా బొగ్గు రవాణా చేయవచ్చు. సూర్యాపేట జిల్లాలోని పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు బియ్యం రవాణాకు ట్రన్స్‌పోర్టు పరంగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఉందానగర్‌ జగ్గయ్యపేట మధ్య ఏర్పాటు చేసే రైల్వే లైన్ వల్ల చిట్యాల, మునుగోడు, నార్కెట్‌పల్లి, నకిరేకల్‌, సూర్యాపేట, కోదాడ వంటి కొత్త ప్రాంతాలకు రైల్వే మార్గం రానుంది. దీంతో ఈ ఏరియాల్లో ఉన్న సిమెంటు పరిశ్రమల ఉత్పత్తుల రవాణా ఊపందుకోనుంది. దీని దూరం 228 కిమీ కాగా, అంచనా వ్యయం రూ.4,104 కోట్లుగా తేల్చింది. ఇవే కాకుండా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలైన భద్రాచలం, రామప్ప, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకూ రైలుమార్గం రానుంది. దీంతో రాష్ట్రంలో 15 కొత్త రైల్వే లైన్లు, మరో 15 అదనపు లైన్లు కలిపి మొత్తం 30 ప్రాజెక్టులకు రైల్వేశాఖ తుది సర్వే మంజూరు చేసినట్లు అయింది. ఆదిలాబాద్‌- నిర్మల్‌- పటాన్‌చెరు ప్రాజెక్టును రూ.5,706 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. ఈ రైల్ మార్గం వల్ల ఉత్తర తెలంగాణతో రాష్ట్ర, దేశ రాజధానులు అనుసంధానం కానున్నాయి. 564 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుకు రూ.12,408 కోట్ల వ్యయం కానుంది.ఈ ప్రాజెక్టు ద్వారా వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, గజ్వేల్‌, యాదాద్రి, భువనగిరి, చిట్యాల, షాద్‌నగర్‌, షాబాద్‌ అనుసంధానం కానున్నాయి.