‘జీ–20’కి సర్వం సిద్ధం

‘జీ–20’కి సర్వం సిద్ధం
  • ఢిల్లీలో 9, 10 తేదీల్లో సదస్సు 
  • ఒకరోజు ముందుగానే బైడెన్, రిషి సునాక్​రాక
  • దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం
  • స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్​లకు మూడు రోజుల సెలవు 

న్యూఢిల్లీ: ప్రపంచదేశాల చూపు భారత్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జీ–20 శిఖరాగ్ర సదస్సు వైపు ఉంది. ఈనెల 9, 10 తేదీల్లో సదస్సు జరగనుండగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. ఈ సమావేశాల్లో ఆయా దేశాల మధ్య కొనసాగుతున్న వ్యాపార, వాణిజ్య అంశాలను చర్చించనున్నారు. అదే సమయంలో ప్రపంచంలోని ఆర్థిక అసమతుల్యతలను రూపుమాపే దిశగా చర్చించనున్నారు. ఆయా దేశాల్లోని సమస్యలను జీ–20దేశాలు ఏకమై ఎదుర్కొనేలా చర్చలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా పలుమార్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఆయా దేశాల అధినేతలకు, రాయబారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, రవాణా సదుపాయం, రుచుల సమ్మేళనం, సమావేశం జరిగే ప్రదేశం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
 
ఢిల్లీలో మూడు రోజులు సెలవు..

మరోవైపు ఢిల్లీలో మూడు రోజులపాటు అన్ని కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఢిల్లీకి వెళ్లే సుమారు 300పైన రైళ్లు రద్దయ్యాయి. అంతేగాక కార్గో సర్వీసులు కూడా సమావేశాలు జరిగే ఈ రెండు రోజులు నిలిపివేశారు. మరోవైపు భద్రతాపరంగా అధికారికంగా ఇప్పటికే 50వేల మంది అన్ని రకాల భద్రతా సిబ్బందితో కలిపి భద్రత నిర్వహిస్తుండగా, అనధికారికంగా ఇంటలిజెన్స్​ను కూడా భారీగానే రంగంలోకి దింపినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలోని రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్​ చేశారు. ఇంకోవైపు ప్రతిపక్షాల నిరసనలు కూడా చేపట్టే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడే నిరసనలు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు.

రూ.2,700 కోట్లతో నిర్మాణం..

జీ–20 శిఖరాగ్ర సమావేశం భారత మండపంలో నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్​సెంటర్​ను రూ.2,700 కోట్లతో నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ 26 జూలై 2023న ప్రారంభించారు. మండపంలో సుమారు 7వేల మంది కూర్చునే వీలు కల్పించారు. ఈ సెంటర్​123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అత్యంత టాప్​లో ఉన్న కన్వెన్షన్​సెంటర్లలో ఒకటిగా ఇది నిలుస్తోంది. ఇందులో 54వేల మీటర్ల ఎయిర్ కండిషన్​కన్వెన్షన్ సెంటర్, మూడు ఓపెన్​ యాంపిథియేటర్లు (ఒకేసారి 3వేల మంది కూర్చొని వీక్షించే ఏర్పాటు), 7 కొత్త ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. ఆద్యంతం ఈ నిర్మాణాలన్నీ కళ్లు జిగేల్​మనిపించేలా ఉన్నాయి.

బెడైన్, సునాక్ రాక..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్​శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే శుక్రవారమే రానున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ వీరితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు పీఎంఓ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బైడెన్, సునాక్​ల​ రాక సందర్భంగా వీరు బస చేసే హోటళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  వీరి కోసం ప్రత్యేక వంట రుచులను సిద్ధం చేశారు. 

సదస్సులో పాల్గొనే దేశాలు..

భారత్, అర్జెంటీనా, బ్రిటన్, బ్రజిల్, కెనడా, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, జర్మనీ, ఇటలీ, తుర్కీ, సౌదీ అరేబియా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ర్టేలియా, చైనా, అమెరికా, సౌత్​కొరియా, యూరోపియన్​ యూనియన్​(ఈయూ), దక్షిణాఫ్రికా ఉన్నాయి.

అతిథులుగా రానున్న దేశాల సభ్యులు

బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్, నైజీరియా, ఓమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ. జీ–20 దేశాల జీడీపీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 85 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులలో ఈ దేశాల వాటా 75 శాతం. ప్రపంచ జనాబాలో 66 శాతం ఈ దేశాలలోనే ఉంది.