సరిహద్దుల్లో శత్రువులకు మన బలం చూపించడం లేదు

సరిహద్దుల్లో శత్రువులకు మన బలం చూపించడం లేదు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్  కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దుల్లోని శత్రువులకు మన బలాన్ని చూపించే బదులు మనలో మనమే పోరాడుతున్నామని అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన 'సంఘ్ శిక్షా వర్గ్' (ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు అధికారుల శిక్షణా శిబిరం) స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు దేశ ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు.  

‘సరిహద్దులో కూర్చున్న శత్రువులకు మన బలాన్ని చూపించడం లేదు. కానీ మనలో మనం పోరాడుతున్నాం. మనం ఒక దేశం అనే విషయాన్ని మరచిపోతున్నాం. దేశ ఐక్యత, సమగ్రతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఏవైనా లోపాలు ఉంటే, మనమందరం వాటిపై పని చేయాలి. కొన్ని మతాలు ఇతర దేశాల నుంచి భారత్ లోపలికి వచ్చాయి. వారితో మనం యుద్ధాలు చేశాం. అయితే బయటివాళ్ళంతా వెళ్లిపోయారు. ఇప్పుడు అంతా మన వాళ్లే ఉన్నారు. కానీ, ఇప్పటికీ బయటి వ్యక్తుల ప్రభావంలో ఉన్నవారు కొందరు ఉన్నారు. అయితే, వారు మన వాళ్ళే అన్న విషయం అర్థం చేసుకోవాలి. వారి ఆలోచనలో ఏదైనా లోపం ఉంటే దాన్ని సంస్కరించడం మన బాధ్యత. బయటి వ్యక్తులు వెళ్ళిపోయినా ఇస్లాం కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ సురక్షితంగా ఉంది’ అని భగవత్ పేర్కొన్నారు. 

దేశంలో గతంలో కుల వివక్ష లేదనే భావనకు కొంతమంది మద్దతు ఇస్తున్నారని, అయితే మన దేశంలో కుల వ్యవస్థ కారణంగా అన్యాయం జరిగిందన్న విషయాన్ని అంగీకరించాలని భగవత్ అన్నారు. మన పూర్వీకుల కీర్తితో పాటు  వారి తప్పిదాలకూ రుణం తీర్చుకోవాలని చెప్పుకొచ్చారు.