నా జీవం, జీవితం  దేశం కోసమే!

నా జీవం, జీవితం  దేశం కోసమే!
  • సంకల్పిస్తే చేసి తీరుతాం!
  • 140 కోట్ల విశాల వసుదైక కుటుంబం మనది
  • ఎందరో నేతల బలిదానంతోనే స్వాతంత్ర్యం సిద్ధించింది
  • అవినీతి, వారసత్వ రాజకీయాలను తరిమి కొడదాం
  • భారత ఐక్యత, 2047 వికసిత భారతే లక్ష్యం
  • మీరు ఆశీర్వదిస్తే వచ్చే ఏడాది ఇక్కడి నుంచే మాట్లాడతా!
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
  • ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగం 

 
సంకల్పిస్తే చేసి తీరుతాం. ఇది మోడీ మాట. ప్రపంచ దేశాల్లోనే మదర్ ఆఫ్​డెమోక్రసీగా భారత్ గర్తింపు పొందింది. భారత ఐక్యతే నా లక్ష్యం.. 2047 వరకు వికసిత భారత్​ను తయారు చేసుకుందాం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. వెయ్యేండ్ల బానిస సంకేళ్లను తెంచుకొని నూతన భవిష్యత్​ను కలిసి మెలిసి ఐక్యతగా నిర్మించుకుందాం. క్షణ క్షణం దేశం కోసమే. నా జీవం, జీవితం, ప్రయాణం అన్నీ భారత మాత కోసమే.. అని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: డెబ్భై ఏడో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మంగళవారం ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత్ వసుదైక కుటుంబమని మీరంతా నా కుటుంబ సభ్యులని మోడీ అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదిస్తే.. వచ్చే ఏడాది కూడా మరోసారి ఇక్కడి నుంచే మీతో మాట్లాడతానని ప్రధాని అన్నారు. మీ ఆశీర్వచనాలు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాలతోనే బానిస సంకేళ్లను తెంచుకోగలిగామని, మరోసారి ఆ పరిస్థితి రానీయకుండా జాగ్రత్తగా అడుగులు వేద్దామని అన్నారు. భవిష్యత్ తరాలకు మరో వెయ్యేళ్ల వరకూ భారత్ పునర్నిర్మాణానికి ఇప్పుడే అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. 140 కోట్ల ప్రజలున్న విశాల భారతదేశం మనదన్నారు. ప్రతీ ఒక్కరూ దేశ వృద్ధి కోసం పాటుపడాలన్నారు. భారత్ ప్రపంచశాంతినే కోరుకుంటోందని, ప్రపంచదేశాల్లో భారత్​పేరు ఇప్పటికే మారు మోగిపోతోందని ప్రధాని మోడీ అన్నారు. 

  • వికసిత భారత్​కోసం తాము కృషి 

2014 నుంచి వికసిత భారత్​కోసం తాము కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ వృద్ధిని సాధించి ప్రపంచదేశాలను ఆకర్షించామన్నారు. దేశంలో అవినీతి, కుటుంబ వారసత్వ రాజకీయం, తృష్టీకరణలు దేశ అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వీటిని చాలామేరకు అరికట్టిందన్నారు. వీటిని భారత్​నుంచి కూకటి వేళ్లతో సహా పెకిలించే వరకూ మోడీ తనవంతు కృషి చేస్తూనే ఉంటాడన్నారు. అలాగే ప్రజలు కూడా భారత్​కు విఘాతం కలిగిస్తున్న ఎలాంటి చర్యలైనా వ్యతిరేకించడానికి వెనుకాడొద్దన్నారు. ఈ మూడు మనకు ప్రధాన శత్రవులని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. 

  • అవినీతి ఏరూపంలో ఉన్నా నిలదీయండి..

దేశంలో తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా ప్రజలు అభద్రతా భావంతో లేరన్నారు. దేశంలో ఎక్కడా పేలుళ్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవినీతి.. దేశానికి పట్టిన ఓ పెద్ద చెద అని తెలిపారు. ఇప్పటికే దాని పీచమణిచగలిగామని భవిష్యత్​లో ఎక్కడా అవినీతి అనే పేరే భారత్​లో వినిపించకుండా చేస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు కూడా తనకు సహకరించాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించాలని, నిలదీయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

  • కుటుంబ వారసత్వం ఎదగనీయదు..

కుటుంబ వారసత్వం ఎప్పుడు దేశం కోసం మంచి చేసే వారిని ఎదగనీయదన్నారు. తమ కుటుంబం మాత్రమే రాజకీయంలో కొనసాగాలనుకుంటోందని, తత్ఫలితంగా వాస్తవంగా దేశం కోసం మేలు చేసే వారిని అణగదొక్కుతుందన్నారు. వారి యోగ్యత, సామర్థ్యాలను స్వీకరించకుండా, బయటికి రానీయకుండా కుటుంబ వారసత్వ రాజకీయంగా దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోందన్నారు. తృష్టీకరణతో కొంతమందికి మేలు చేకూర్చేందుకు కొన్ని వ్యవస్థలు, పార్టీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇది దేశాభివృద్ధికి నిరోధకంగా మారుతోందన్నారు. ఈ మూడు దేశాభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడింటిని అంతం చేసి తీరుతామని ప్రధాని మోడీ అన్నారు.  

  • నారీ శక్తిపై ప్రధాని  ప్రశంసలు..

నారీ శక్తిపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే కాలంలో దేశాభివృద్ధిలో నారీ శక్తి పాత్ర కీలకంగా మారనుందన్నారు. ఇప్పటికే ప్రతీ రంగంలోనూ నారీ శక్తి తన సత్తా చాటుతోందన్నారు. అందుకు తమ ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. ఎయిరోస్పేస్​ రంగంలో అత్యంత ఎక్కువ మహిళా పైలెట్​లు మన దేశంలో ఉన్నారని మోడీ కొనియాడారు. ఇలా అన్ని రంగాల్లోనూ నారీమణులు దేశానికి మణిహారాలుగా, దేశ దిక్సూచిగా నిలవడం గర్హనీయమన్నారు.  

  • మణిపూర్​హింస తగ్గుముఖం పడుతోంది..

మణిపూర్​హింస క్రమేణా తగ్గుముఖం పడుతోందన్నారు. అక్కడ రాజకీయాలు చేయడం తగదన్నారు. దేశం మొత్తం మణిపూర్​వెంట ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే దేశంలోని ఏ రాష్ర్టంలోనైనా చెడు జరిగితే దాని ప్రభావం దేశంపై పడుతుందన్నారు. కుటుంబంలోని ఓ వ్యక్తి అనారోగ్యంగా ఉంటే మిగతా కుటుంబ సభ్యులు ఎలానైతే బాధపడతారో అదే బాధ తనకూ ఉందన్నారు. త్వరలో మణిపూర్​లో పరిస్థితులు సద్దుమణిగి శాంతి వెల్లివిరియాలని, అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని ప్రధాని ఆకాంక్షించారు. ఇందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను దేశాభివృద్ధి కోసం 140 కోట్ల కుటుంబ వ్యవస్థ బాగు కోసం, భవిష్యత్​లో భారత్​ను ప్రపంచదేశాల్లో ప్రత్యేకంగా నిలిచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటానని, మీ కోసమే కష్టపడుతూనే ఉంటానన్నారు. మీ ఆశీర్వాద బలం తన వెన్నంటే ఉండాలని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.