మంత్రుల పేషీలో  రాసలీలలు?

  మంత్రుల పేషీలో  రాసలీలలు?
  • నలుగురు మినిస్టర్ల పేషీ ఉద్యోగులపై ఆరోపణలు
  • సమస్యలతో వచ్చే మహిళలు, యువతులే టార్గెట్
  • అవసరాన్ని ఆసరాగా తీసుకుని లొంగదీసుకుంటున్న వైనం
  • సంచలనం రేపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీ ఉద్యోగి వ్యవహారం
  • కంప్యూటర్​ఆపరేటర్​ను తొలగించిన మినిస్టర్​
  • పనుల కోసం వచ్చే ఉద్యోగుల నుంచి వసూళ్లు
  • సీఎంకు ఇంటలిజెన్స్ రిపోర్టు?

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రుల పేషీలో కొందరు కీచకావతారం ఎత్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఆర్థిక సాయం, న్యాయం కోసం వచ్చే బాధిత మహిళలు, యువతులపై కన్నేస్తున్నారు. కుదిరితే వసూళ్లు, లేకపోతే బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని, వారిని నమ్మిస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

  • సాయం సాకుతో కామవాంఛ..

మంత్రుల పేషీలో ఉన్న కొందరు బాధితులకు సాయం చేస్తామనే సాకుతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. కాగా పనికాక మోసపోయిన బాధితులూ వీరిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో వెలుగుచూసిన కీలక అధికారి విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ అంశం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెంటనే సదరు అధికారిని సస్పెండ్ చేసి..హై లెవల్ విచారణ చేపట్టడం తీవ్ర చర్చకు దారితీసింది.

  • వెలుగులోకి అసభ్యకర మెసేజ్ లు..

హకీంపేట ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఇటీవల తనకు ఆర్థిక సాయం చేయాలని ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణికి మినిస్టర్​శ్రీనివాస్ గౌడ్​పేషీకి వచ్చింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకుని మంత్రి పేషీలో పని చేసే కంప్యూటర్​ఆపరేటర్.. ఆమెకు అసభ్యకర మెసేజ్ లు పంపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించిన మంత్రి.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించేశారు. ఇవి మచ్చుకు మాత్రమే.. ఇంకా వెలుగులోకి రాని ఘటనలు.. బాధితులు పంటికింద బాధను భరించిన, భరిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నట్లు సమాచారం.

  • మరో ముగ్గురు మంత్రుల పేషీలోనూ..

కేవలం ఈ ఒక్క శాఖలోనే కాదు మరో ముగ్గురు మంత్రుల పేషీలోనూ ఇలాంటి కీచకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో ఇద్దరు, దక్షిణ తెలంగాణలో మరో ఇద్దరు మంత్రుల పేషీ ఉద్యోగులపై ఇటీవల ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వివిధ పనుల కోసం తమ వద్ద వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల సమస్యలు వింటోన్న మంత్రులు.. పేషీ ఉద్యోగులకు పూర్తి వివరాలు అందజేయాలని చెప్పడం.. ఫిర్యాదుదారులు పేషీ ఉద్యోగులను సంప్రదించడంతో ఆ సమయంలో బాధితుల సెల్​ ఫోన్ నంబర్లు తీసుకుని వారితో పర్సనల్​ గా మాట్లాడడం కొంత మంది ఉద్యోగులకు పరిపాటిగా మారింది. బాధితులతో పేషీ ఉద్యోగుల వ్యవహార శైలి గురించి మంత్రులకు తెలిసినా.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

  • వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులు..

మంత్రుల పేషీలో కీచక వ్యవహారాన్ని అటుంచితే.. ఇంకొందరి మంత్రుల పేషీలో ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చే బాధితులు, ఉద్యోగులకు సంబంధించిన పనులు చేసి పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్​చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నేరుగా రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఫోన్ చేసి.. ఇది మంత్రి గారి పర్సనల్​పని.. కచ్చితంగా చేసిపెట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. నిబంధనలు, విధివిధానాలకు వ్యతిరేకంగా పనులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అధికారులు మంత్రులకు మొర పెట్టుకుంటున్నారు. మినిస్టర్ల పీఏల వ్యవహార శైలితో తమ భవిష్యత్, సర్వీస్​ ప్రమాదంలో పడుతుందని, అలాంటి పనులు చేయబోమని మంత్రులకు విన్నవించినట్లు తెలిసింది. 

  • ఉత్తర తెలంగాణ మంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు..

ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి పీఏ ఇటీవల తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని ఒడిసి పట్టుకున్న సదరు ఉద్యోగి.. తెరచాటు పైరవీలకు తెరలేపారు. పోలీస్​శాఖలో అనుకూల స్థానాల్లో బదిలీలు కోరుకుంటోన్న ఎస్ఐ, సీఐల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆరోపణలు వినిపించాయి. అయితే ఇందులో నేరుగా మంత్రికీ వాటా ఉంటుందనే ప్రచారం జరిగింది. పీఏపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా సదరు మంత్రి తన పీఏను మార్చకపోవడం ఆ జిల్లాలో హాట్​టాపిక్​గా మారింది. ఇదిలావుంటే ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు, పీఏల వ్యవహారంపై విచారణ చేపట్టిన ఇంటలిజెన్స్​వర్గాలు సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో దళితబంధు పథకం లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కొంతమంది ఎమ్మెల్యేలే నేరుగా బేరసారాలకు దిగడం.. ఆ విషయం సీఎం కేసీఆర్​దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్​కావడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయ ఉద్యోగులపై వస్తోన్న ఆరోపణలు, వెలుగుచూస్తున్న సంఘటనలపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.