వచ్చేవారం నుంచి  డబుల్​ఇండ్ల పంపిణీ

వచ్చేవారం నుంచి  డబుల్​ఇండ్ల పంపిణీ
  • జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల ఇండ్లు 
  • ఆరు విడుతల్లో అర్హులకు అందిస్తాం
  • అధికారుల సమీక్షలో మినిస్టర్​కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : డబుల్ బెడ్​రూం ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ఇండ్ల పంపిణీ చేస్తామని ప్రకటించింది. పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్​రూం ఇండ్ల భారీ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీ పై ప్రగతిభవన్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. 

  • 70 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి..

హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 70 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అధికారులు కేటీఆర్ కు తెలిపారు. అయితే అర్హులను గుర్తించే ప్రక్రియకూడా వేగంగా కొనసాగుతోందని,  ఇండ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తి కావచ్చిందని పేర్కొన్నారు. 

  • విడుతలవారీగా పంపిణీ..

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్ల పంపిణీని విడతలవారీగా చేపట్టాలన్నారు. వారం రోజుల్లో మొదటి విడత పంపిణీ ప్రారంభం కానుందని ప్రకటించారు. మొత్తం 70 వేల ఇళ్లను ఆరు దశల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత డబుల్ బెడ్​రూం ఇండ్ల పంపిణీకి  ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే డబుల్ బెడ్​రూం ఇండ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులే క్షేత్రస్థాయిలో అర్హులను పరిశీలించి గుర్తిస్తున్నారని, ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని అన్నారు. గూడులేని పేదవారందరికీ డబుల్ బెడ్​రూం ఇండ్లను అందిస్తామన్నారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని  మంత్రి కేటీఆర్ సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. సమీక్షలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.