బహుముఖ ప్రజ్ఞాశాలి ‘సురవరం’

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘సురవరం’
  • తెలుగు నేలపై ఆయనది గొప్ప చరిత్ర
  • మినిస్టర్లు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​
  • బషీర్​బాగ్​లో టీయూడబ్ల్యూజే​భవనం ప్రారంభం
     

ముద్ర, తెలంగాణ బ్యూరో : సురవరం ప్రతాపరెడ్డి లాంటి వ్యక్తి తెలుగు నేలపై మరొకరు లేరని, పాత్రికేయుడిగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, ఎమ్మెల్యేగా ఆయన పలురకాల దక్షతను కలిగిన గొప్ప వ్యక్తి అని మినిస్టర్లు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా బషీర్ బాగ్ లో రూ.2 కోట్లతో పునర్నిర్మించిన జర్నలిస్ట్ యూనియన్ భవనాన్ని మంత్రులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సురవరం తక్కువ సమయంలోనే ఎన్నో పదవులు అధిరోహించారని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభిర్ణించారు. అలాంటి గొప్ప వ్యక్తి 58 ఏళ్లకే వారు మరణించడం దురదృష్టకరమన్నారు. సురవరం దృష్టి కోణంపై రెండు సంకలనాలు తీసుకువచ్చామని, మూడో సంకలనంలో మలిదశ తెలంగాణ ఉద్యమం, సాంఘిక, రాజకీయ చైతన్యాన్ని ఇందులో పొందుపర్చామన్నారు. తాజాగా 12 మంది కవులు, సాహిత్యకారులతో కలిసి సురవరం సమాచారం సేకరించి సంకలనాల్లో పొందుపరిచామని, భవిష్యత్ లో పీహెచ్ డీ చేసే వారికి ఇవి ఉపయోగపడతాయన్నారు. 

  • జర్నలిస్టు యాజమాన్యాల ధోరణి మారింది..

ప్రస్తుత జర్నలిజంలో రెండు పార్శ్వాలు ఉన్నాయని, జర్నలిజం వృత్తిగా ఎంచుకుని యాజమాన్యాల కింద పనిచేస్తున్నారని, ఇక్కడ యాజమాన్యాలది వ్యాపారాత్మక ధోరణిగా మారిందని, భవిష్యత్ లో ఈ విధానం మరింత పెరిగే అవకాశం ఉన్నదని మంత్రులు నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అనేక భాషల్లో ఏర్పడిన పత్రికలు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో అక్కడి ప్రజా సమూహాల్లోని చైతన్యాన్ని పెంచడానికి ఒక కర్తవ్య దీక్ష తీసుకుని ముందుచూపు కలిగిన వాళ్లు ప్రజలను నడిపించడానికి జర్నలిజాన్ని ఒక ఆయుధంగా వాడారన్నారు. కాగా మంత్రులు ప్రారంభించిన భవనంలో కార్యాలయం, ఆడిటోరియం, మీడియా సమావేశపు మందిరం, డిజిటల్ లైబ్రరీ, స్టూడియో రూం తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. అలాగే ఏపీయూడబ్యూజే కు కూడా ఒక కార్యాలయ గదిని కేటాయించారు. ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ సభలో మాజీ ఎంపీ, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె. విరాహాత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శులు వై.నరేంద్ర రెడ్డి, డి. సోమసుందర్, ఏపీయూ డబ్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, స్కెబ్స్ న్యూస్ ఎడిటర్ ఆలపాటి సురేశ్​కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్యూజే తరపున ఐవీ సుబ్బారావు సందేశమిచ్చారు.