ప్రజలను అప్రమత్తం చేయడం అగ్నిమాపక  వారోత్సవాల ముఖ్య ఉద్దేశం

ప్రజలను అప్రమత్తం చేయడం అగ్నిమాపక  వారోత్సవాల ముఖ్య ఉద్దేశం
  • ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు
  • అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ లో  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్, పాంప్లెట్స్, స్టికర్స్ లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.అగ్నిమాపక అఖిలభారత వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ వారోత్సవాలలో ప్రతి రోజు ఒక ప్రజా సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారని, ప్రజలను అప్రమత్తం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు.

ఏప్రిల్ 15న జిల్లాలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ప్రజా సంచార ప్రదేశాలు, ఏప్రిల్ 16న అపార్ట్మెంట్స్ నందు, ఏప్రిల్ 17న ఆసుపత్రులు, ఏప్రిల్ 18న పెట్రోల్ బంక్స్, గ్యాస్ సిలిండర్ గోదాములు, ఏప్రిల్ 19న వాణిజ్య ప్రదేశాలు మల్టీప్లెక్స్, సినిమా థియేటర్స్,  విద్యాసంస్థలు,  ఫంక్షన్ హాల్స్ లలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్ 20న ఫైర్ స్టేషన్ లో సెమినార్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

పెద్దపల్లి అగ్నిమాపక కార్యాలయంలో 1944వ సంవత్సరంలో ఏప్రిల్ 14న ముంబైలో ఒక భారీ నౌకకు అగ్నిప్రమాదం సంభవించి, అగ్ని ప్రమాదం నివారించే సమయంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారని వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ అగ్నిమాపక జెండా సగం వరకు ఎగరవేసి, 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తూ వారికి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి.శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం.డి. సిరాజుద్దీన్, డ్రైవర్ ఆపరేటర్ పి.చంద్రయ్య, అగ్నిమాపక సిబ్బంది కే. శ్రీనివాస్, పి.నరేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.