మరో జర్నలిస్టును బలిగొన్న రియల్ మాఫియా

మరో జర్నలిస్టును బలిగొన్న రియల్ మాఫియా
Journalist Shashikant Warishe

నిజాయితీకి ప్రతిఫలం మరణమేనా...!

నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే మరో జర్నలిస్టును సంఘ వ్యతిరేక శక్తులు బలిగొన్నాయి. మహారాష్ట్రలో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాఫియా శశికాంత్ వారిషే అనే జర్నలిస్టును దారుణంగా హత్య చేసింది. రియల్ ఎస్టేట్ మాఫియా ముఠా నాయకుడు స్వయంగా తాను ప్రయాణిస్తున్న వాహనంతోనే జర్నలిస్టును ఢీ కొట్టించి చంపించాడు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన దేశంలోని జర్నలిస్ట్ లోకాన్ని కలవరపరుస్తున్నది.  ముంబాయికి 420 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలో ఒక రిఫైనరీ ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సంస్థకు తొత్తుగా పనిచేస్తున్న పండరినాథ్ అంబేద్కర్ అనే వ్యక్తి తన ఎస్  యు వి వాహనంతో ఢీ కొట్టించి జర్నలిస్టును హత్య చేయించాడు. నానరీ రిఫైనరీ ఏర్పాటు కోసం భూసేకరణ జరుపుతున్న కార్పొరేట్ సంస్థకు స్థానికంగా వ్యతిరేకత ఎదురైంది. దీన్ని అణచివేయడానికి పండరీనాథ్ ను ఆ సంస్థ తన ఏజెంట్ గా నియమించుకుంది.

మహానగరీ టైమ్స్ అనే అనే మరాఠా పత్రికకు విలేకరిగా పనిచేస్తున్న శశికాంత్ వారిషే (48) ఈ విషయంపై వరుస కథనాలు రాసినందుకు గాను  పండరినాథ్ అంబేద్కర్ కక్ష పెంచుకున్నాడు. ఇలాగే రాస్తూపోతే తమ చేతిలో దెబ్బ తినడం ఖాయమని హెచ్చరించాడు కూడా. బెదిరింపులకు భయపడని శశికాంత్ తన కథనాలను కొనసాగించాడు. రియల్ ఎస్టేట్ మాఫియా ముఠాను నడుపుతున్న పండరినాథ్ అంబేద్కర్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ అనేక వార్తలు రాశాడు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ ల చిత్రాల సరసన పండరీనాథ్ ఫోటో కూడా ఉన్న ఒక ఫ్లెక్సీ వెలిశింది.  ఈ ఫోటోతో సహా శశికాంత్ రాసిన ఒక కథనాన్ని మహానగర్ టైమ్స్ ఫిబ్రవరి 6న ప్రచురించింది. శశికాంత్ కు అదే చివరి వార్త అయింది. దీనితో శశికాంత్ పై పండరీనాథ్ మరింత కోపం పెంచుకున్నాడు.  ఫిబ్రవరి 7న రత్నగిరి పట్టణంలోని ఒక పెట్రోల్ బంకు వద్ద స్కూటర్ పై ప్రయాణిస్తున్న జర్నలిస్టును పండరినాథ్ తన వాహనంతో ఢీ కొట్టించి కొన్ని మీటర్ల దూరం వరకూ అలాగే  ఈడ్చుకు వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన శశికాంత్ ను ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆయన మరుసటి రోజు తుది శ్వాస విడిచాడు. పండరినాథ్ అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచామని, ఫిబ్రవరి 13 వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడని రత్నగిరి జిల్లా ఎస్పీ ధనుంజయ్ కులకర్ణి చెప్పారు.

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలి: ఐజేయూ

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( ఐజేయూ) తో సహా అనేక జాతీయ, స్థానిక జర్నలిస్టు సంఘాలు ప్రెస్ క్లబ్ లు, పౌర సంఘాలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పట్టపగలు ఒక జర్నలిస్టును సంఘ వ్యతిరేక శక్తులు ఇంత కిరాతకంగా చంపడం ప్రజాస్వామ్యం పై దాడి చేయడమేనని ఐజేయూ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము వ్యాఖ్యానించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి నేరస్థులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేక చట్టం తేవాలన్న తమ డిమాండ్ ను వారు పునరుద్ఘాటించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ వర్కింగ్ యూనియన్,  ముంబై ప్రెస్ క్లబ్, ముంబై క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టు సంఘాలు, పియుసిఎల్ వంటి సంఘాలు శశికాంత్ తీవ్రంగా ఖండించాయి. ముంబైలో పలు జర్నలిస్ట్ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శశికాంత్ వారిచే హత్య వెనుక గల కుట్రను చేదించాలనీ, శశికాంత్ కుటుంబానికి భద్రత కల్పించాలని, 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.