రంగంలోకి సోనియా!

రంగంలోకి సోనియా!
  • తెలంగాణ రాజకీయాలపై ఏఐసీసీ అగ్రనేత ఫోకస్
  • కాంగ్రెస్ నేతల విభేదాలకు చెక్​
  • అధికారం అవకాశం కోల్పోకుండా చర్యలు
  • ఈనెల 16 నుంచి మూడ్రోజులు ఇక్కడే మకాం
  • సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభలో ప్రసంగం

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికలనూ బేఖాతర్ చేస్తూ వర్గపోరుకు ఆజ్యం పోస్తున్న సీనియర్లను గాడిలో పెట్టేందుకు స్వయంగా తానే రంగంలో దిగుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు అనుకూలంగా వీస్తున్న పవనాలను తమ వైపునకు తిప్పుకుని అధికారం చేజిక్కించుకునేలా టీ కాంగ్రెస్ నేతలకు ఆమె ఎలాంటి దిశానిర్దేశం చేస్తారోనని ఉత్కంఠగా మారింది. 

హైదరాబాద్​లో మూడు రోజులు..

మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండాలని నిర్ణయించుకున్న సోనియా.. ఎలాంటి గెలుపు వ్యూహాన్నిరచిస్తారు.? ఇప్పుడిదే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్​ గా మారింది. కర్ణాటక ఫలితాల తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపై దృష్టిపెట్టిన ఏఐసీసీ ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులొడ్డుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్​ గాంధీ సైతం చేవెళ్ల, ఖమ్మం బహిరంగసభలో పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మక సీడబ్ల్యూసీ సమావేశాలకూ హైదరాబాద్ ను వేదికగా చేసుకున్న ఏఐసీసీ అందులో దేశ రాజకీయాల్లోనే మార్పు తెచ్చే కీలక నిర్ణయాలు, ప్రకటనలకు సిద్ధమవుతోంది. 

సోనియా కీలక ప్రకటనలు..?

ఈనెల 16, 17న జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతోన్న అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడితో కలిసి కీలక ప్రకటనలు చేస్తారని, 18న నియోజక వర్గాలలో జాతీయ స్థాయి ముఖ్య నాయకుల సభలపై చర్చ జరుగుతుందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ నెల 17న సాయంత్రం (సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం)హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో సోనియా గాంధీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తానికి ఈనెల 16 నుంచి 18 మూడ్రొజుల పాటు హైదరాబాద్​లో ఉండనున్న సోనియాగాంధీ టీ కాంగ్రెస్ నేతలకు చికిత్స చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  ఇప్పటికే తెలంగాణ ఇచ్చి అధికారం పొందని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ అవకాశాన్ని చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్​ వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ల మద్య నెలకొన్న విభేదాలు, పొరపచ్చాలు పార్టీ అభ్యర్థుల గెలుపుపై ప్రతికూల ప్రభావం పడి.. ప్రత్యర్థులకు కలిసొచ్చే అంశాలుగా మారే అవకాశాలున్నాయి. దీంతో విభేదాలు పక్కనబెట్టి అధికారం కోసం కలిసి పని చేయాలని ఇది వరకే పలుమార్లు సీనియర్లను ఏఐసీసీ హెచ్చరించింది. 

ముందే హెచ్చిరించిన ఖర్గే..

ఇటీవల హైదరాబాద్​ కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం సీనియర్లందరూ కలిసి పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కుతామని.. ఇకనైనా మారాలని హెచ్చరించారు. కానీ మరుసటి రోజే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం గాంధీభవన్ లో జరిగిన ప్రదేశ్​ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్​రెడ్డికి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్, రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి.హనుమంతరావుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్​ ను తెలంగాణకు పంపి అభ్యర్థుల ఎంపిక పై మూడు రోజుల పాటు కసరత్తు చేయించింది. అయినా పలువురు సీనియర్లు బీసీలు, మహిళలు, ఓయూ విద్యార్థి నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గెలిచే గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సీనియర్ల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టడం ప్రస్తుతం ఎవరి పరిధిలో లేకపోవడంతో నేరుగా సోనియాగాంధీని రంగంలో దించి ఆమెతో చెప్పించాలని భావిస్తోంది. ఏదేమైనా సోనియా గాంధీ హైదరాబాద్​ పర్యటన తర్వాతనైనా కాంగ్రెస్​ సీనియర్ల తీరులో మార్పు వస్తుందా.? రాదా..? వేచి చూడాలి.