గోవింద కోటి రాస్తే వీఐపీ దర్శనం

గోవింద కోటి రాస్తే వీఐపీ దర్శనం
  • 10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు రాసిన వారికి దర్శం
  • టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రామకోటి తరహాలో గోవింద నామాలను రాసిన యువత, వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనం భాగ్యం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ప్రకటించింది. మంగళవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి గోవింద నామకోటి రాసిన వారితో సహా కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తామన్నారు. అలాగే 10 లక్షల 1,116 పర్యాయాలు గోవింద నామం రాసిన వారికీ దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న పాత సత్రాలను తొలగించి, కొత్తగా  అచ్యుతం, శ్రీ పథకం పేరిటి రెండు వసతి సముదాయాలను నిర్మిస్తామని చెప్పారు. ఈ అతిథి గృహాల నిర్మాణానికి రూ.300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భైరాగి పట్టడి, కేశవాయన గంటా ప్రాంతాల్లో రహదారుల ఆధునికీకరణకు రూ.135 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. టీటీడీలో 413 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన వెల్లడించారు. అలాగే 47 వేద అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగాలకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. 29 మంది స్పెషలిస్టులు, 15 మంది డాక్టర్ల నియామకం చేపడుతున్నట్టు చెప్పారు.