బిజెపి కి వ్యతిరేకంగా వచ్చే పోస్టులపై చర్యలేవి

బిజెపి కి వ్యతిరేకంగా వచ్చే పోస్టులపై చర్యలేవి
  • పరంధాం అరెస్టు అన్యాయం
  • బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కరీంనగర్ బిజెపి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బిజెపి కార్యకర్త పరంధామును పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలోచట్టం బిఆర్ఎస్ ప్రభుత్వానికి చుట్టం లాగా మారిందని అన్నారు. అకారణంగా చిన్న  విషయాలపై కూడా అతిగా వ్యవహరిస్తుందని, బి ఆర్ ఎస్ కు  వ్యతిరేకంగా కరీంనగర్ బిజెపి సోషల్ మీడియా నాయకుడు పరంధాం చేసిన   పోస్ట్  పై కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. కెసిఆర్ పోలీసుల రాజ్యం నడిపిస్తు , బిజెపి శ్రేణులను  భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం అవివేకమని మండిపడ్డారు. కరీంనగర్ పట్టణానికి చెందిన బిజెపి సోషల్ మీడియా నాయకుడు పరంధాంను  అక్రమంగా అరెస్టు చేసి, హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, స్వేచ్ఛ వాతావరణం లేకుండా పోలీసుల చర్యలతో,నిర్బంధంతో ప్రతిపక్షాలను,ప్రజలను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.  సెక్రటేరియట్ అగ్రి ప్రమాదంలో పెట్టిన పోస్ట్ పై  ఇంతలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం బిజెపి పై బిఆర్ఎస్ పార్టీ కి చెందిన వాళ్లు పెట్టిన పోస్టులపై  అనేక ఆధారాలతో ఫిర్యాదులు చేసిన ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం పోలీసులతో  అక్రమ కేసులు పెట్టించి , సామాన్య ప్రజలను ప్రతిపక్షాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను  ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. పరంధాం  విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్  సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారని తెలిపారు. జోన్ అధ్యక్షులు పాదం శివరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.