నో ఛేంజ్

నో ఛేంజ్
  • సీఎం ప్రకటించిన జాబితాయే ఫైనల్
  • ఒకటీ, రెండు మినహా మార్చేది లేదు
  • మంత్రి కేటీఆర్​నుంచి ఆశావహులకు స్పష్టత
  • ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ సూచన
  • భవిష్యత్తులో న్యాయం చేస్తామని భరోసా
  • ప్రగతిభవన్​లో కేసీఆర్, కేటీఆర్ మధ్య చర్చ
  • తమ అభ్యర్థులందరూ గెలుస్తారన్న కేసీఆర్​ 
  • ఇక దీని మీద డిస్కషన్ వద్దని స్పష్టీకరణ
  • క్యాండిడేట్లకు పార్టీ తరపున ఎన్నికల ఖర్చులు రిలీజ్?​
  • సెగ్మెంట్ల పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న అధినేత


‘ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. దీనిపై మాట్లాడడానికి కూడా ఏమీ లేదు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆశావహులకు స్పష్టత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు నియోజకవర్గాలలో తప్ప మిగతా చోట జాబితాలో ప్రకటించినవారే  అభ్యర్థులుగా కొనసాగుతారని స్పష్టం చేశారని అంటున్నారు. టిక్కెట్ ఆశించడంలో తప్పులేదని, ఒకసారి జాబితాను ప్రకటించిన తరువాత మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోతే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయని సముదాయిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థులను మార్చి అధిష్టానం తమకే టిక్కెట్ కేటాయిస్తుందని ఎవరూ ఆశ పెట్టుకోవద్దని ఆశావహులకు కేటీఆర్ ఖరాఖండిగా చెబుతున్నారని తెలిసింది.


ముద్ర, తెలంగాణ బ్యూరో:విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాదుకు చేరుకున్నప్పటి నుంచి కేటీఆర్ ఇదే అంశంపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 115సెగ్మెంట్లకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గత నెలలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఏడు నియోజకవర్గాలు తప్ప, దాదాపుగా సిట్టింగ్ శాసనసభ్యులందరికీ మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు. కానీ, ఈ జాబితాపై పలు నియోజకవర్గాలలో నిరసన వ్యక్తం అయ్యింది. అనేక సెగ్మెంట్లలో సిట్టింగ్ శాసనసభ్యులకు, ఆశావహులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. కొందరు ఆశావహులకు గతంలో కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించింది. దీంతో విదేశాల నుంచి ఆయన హైదరాబాదుకు చేరుకోగానే అభ్యర్థుల జాబితాలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని భావించారు.  కానీ, అటువంటి సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. జాబితాలో మార్పులు చేయడానికి సీఎం కేసీఆర్ ససమేరా అని అంటున్నారని తెలుస్తోంది. ఆశావహుల ఒత్తిడి మేరకు కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్దులను మార్చే ప్రతిపాదనను కేసీఆర్ వద్దకు కేటీఆర్ తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులలోనూ జాబితాలో మార్పులు ఉండవని కేటీఆర్ కు సైతం ఆయన స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అభ్యర్ధులను ఎలా గెలిపించుకోవాలో తనకు బాగా తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారని అంటున్నారు. 

మైనంపల్లిని మాత్రమే!

ఒకవేళ మార్చాల్సి వస్తే, మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మల్కాజిగిరి సిట్టింగ్ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావును మాత్రమే మార్చుతామని సీఎం చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ద్వారా టిక్కెట్లు పొందాలని ఆశించిన వారికి భంగపాటు తప్పేట్టు కనిపించడం లేదు. దీంతో ఆశావవలను ప్రగతి భవన్ కు పిలుపించుకుని నాలుగైదు రోజులుగా కేటీఆర్ వరసగా సమావేశం అవుతున్నారు. టిక్కెట్లు రాలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందువల్ల భవిష్యత్తులో అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. విభేదాలను  పక్కన పెట్టి  అభ్యర్ధులతో కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. మనలో మనం గొడవ పడి ప్రతిపక్షాలు మేలు చేసేందుకు దోహదపడొద్దని కేటీఆర్ నచ్చచెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కొందరు నేతలు మెత్తపడినట్లుగా తెలుస్తోంది. అభ్యర్థులతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల ఖర్చు రిలీజ్?

రాష్ట్రంలో అధికారికంగా ఎన్నికల కమిషన్ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. కేసీఆర్ మాత్రం నాలుగు నియోజకవర్గాలకు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వారికి తొలి విడత ఎన్నికల నిధులు విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ విడుదల తరువాత మరో దఫా నిధులను విడుదల చేసే అవకాశముందని అంటున్నారు. అభ్యర్ధుల ప్రకటన ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం కేసీఆర్ అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అభ్యర్థులు సాగిస్తున్న ప్రచారం, ప్రజలతో మమేకం అవుతున్న తీరు, ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తున్నారన్న అంశాలపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారని  పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది.