మేనిఫెస్టో మీద కసరత్తు 

మేనిఫెస్టో మీద కసరత్తు 
  • కమిటీకి ఆకునూరి, డెమొక్రటిక్​ ఫోరం నివేదిక
  • విద్య, వైద్యం, వ్యవసాయం, అవినీతి అంశాలపై సమాలోచనలు
  • ప్రాధాన్యతాంశాల మీదనే కాంగ్రెస్ దృష్టి

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమైన తెలంగాణ కాంగ్రెస్ ప్రాధాన్యాంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ నెల 12న తొలి సమావేశం నిర్వహించిన మేనిఫెస్టో కమిటీ జనం నిర్ణయం మేరకే తాము ప్రకటించే హామీలు, ఇచ్చే వాగ్దానాలు ఉంటాయని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం మరోసారి గాంధీభవన్ లో జరిగిన సమావేశానికి  మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆయనతో పాటు సోషల్ డెమొక్రటిక్ ఫోరం ప్రతినిధులు తెలంగాణలో విద్యా, వైద్యం, వ్యవసాయం ఎట్లుండాలి? తెలంగాణలో అవినీతిని ఎట్లా నిర్మూలించాలి? తెలంగాణలో కుల ఘణన ఎందుకు చేయాలి? తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఉపాధి కల్పన ఎట్లుండాలి? తదితర అంశాలపై మేనిఫెస్టో కమిటీకి నివేదికలు అందజేశారు. ఆకునూరితో పాటు ఫోరం ప్రతినిధుల ప్రతిపాదిత నివేదికపై కమిటీ చైర్మన్​ శ్రీధర్ బాబుతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో బూత్, మండల కమిటీలు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ  ట్రైనింగ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన కమిటీ, బాధ్యతలు, రోడ్ మ్యాప్ పై చర్చించారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బూత్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలు పోషించాల్సిన పాత్రపై ఆయా కమిటీలకు అవగాహన కల్పిస్తున్నట్లు పొన్పం చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.