అప్రూవర్ గా మారిన అరుణ్ రామచంద్ర​

అప్రూవర్ గా మారిన అరుణ్ రామచంద్ర​
  • ఢిల్లీ లిక్కర్​స్కామ్ లో కీలక పరిణామం
  • కవిత బినామీగా ఆయన మీద అభియోగాలు
  • కవితకు 75 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు
  • తాజా పరిణామాలతో సౌత్ గ్రూప్​లో ఆయోమయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :ఢిల్లీ లిక్కర్​ కేసులో కీలక వికెట్లు ఈడీ చేతికి చిక్కుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అభియోగాలున్న అరుణ్​ రామచంద్ర పిళ్లై (ఏపీ) అప్రూవర్​గా మారాడు. హైదరాబాదుకు చెందిన పిళ్లై ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికితోడుగా తీహార్​ జైలులో ఇదే కేసులో అండర్​ ఖైదీగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సైతం ఏపీ ద్వారా రూ. 75 కోట్లు హైదరాబాదులోని బీఆర్ఎస్​ నేత ఇంటిలో ఇచ్చినట్లుగా సుదీర్ఘ లేఖ బయటకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారి164 కింద ఈడీ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. పిళ్ళై దగ్గర నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. 

ఈడీ చేతికి సౌత్ గ్రూపు లెక్కలు

ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపులోని పలువురు సభ్యులు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అప్రూవర్స్‌గా మారిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్ళైతోపాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఈ అప్రూవర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. రానున్న కొద్ది రోజులలో ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మాగుంట, ఆయన కుమారుడు రాఘవ, శరత్​ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్​గా మారినప్పటికీ, ప్రస్తుతం అప్రూవర్‌గా మారిన ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ కవితతో ఆర్థిక లావాదేవీలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. మార్చి ఏడున ఈడీ అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పలు దఫాలుగా ఇల్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. గతంలో ఎమ్మెల్సీ కవితను విచారించిన నేపథ్యంలోనే అరున్​ పిళ్లై సమాచారమే కీలకంగా ఉందని భావించారు. ప్రస్తుతం ఆయన అప్రూవర్​గా మారడంతో బీఆర్​ఎస్​ వర్గాల్లో కొంత ఆయోమయం నెలకొన్నది. 

పిళ్లై సమాచారం

ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం ఇండోస్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన రూ.69 కోట్ల డబ్బులో, రూ.29 కోట్లు పిళ్లై అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఈ డబ్బులో పిళ్లై ఒక టీవీ ఛానల్ అధినేతకు రూ.4.75 కోట్లు, రూ.3.85 కోట్లను అభిషేక్ బోయిన‌పల్లి అకౌంట్‌కు పేమెంట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అభిషేక్ బోయిన‌పల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, అరుణ్ రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి అడ్రస్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువులకు చెందిన బ్యూటీపార్లర్ ఒకటే అడ్రస్‌తో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ సందర్భంగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారని ఈడీ వెల్లడించింది. పిళ్లై నుంచి రూ.25 కోట్లు నేరుగా కవితకు  ట్రాన్స్ఫర్ చేశారంటూ ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.