105 సీట్లు మావే

105 సీట్లు మావే
  • ఈసారి అధికారమూ మాదే!
  • సిటీలో మజ్లిస్ తో కలిసి 29 గెలుస్తాం 
  • 17 ఎంపీ స్థానాలలోనూ విజయం మాదే
  • అక్టోబర్ 16న వరంగల్ లో ‘సింహగర్జన’
  • అక్కడే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం
  • ప్రజలకు ఏం కావాలో మాకు బాగా తెలుసు
  • మేనిఫెస్టోలో లేని పథకాలూ అమలు చేస్తున్నాం
  • టికెట్లు రాలేదని నేతలు చిన్నబుచ్చుకోవద్దు
  • పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తాం
  • పార్టీ నిర్ణయం మేరకే రెండు స్థానాలలో పోటీ
  • బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు విడుదలలో సీఎం కేసీఆర్


రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధిస్తామని బీఆర్ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్​జిల్లాలలోని మొత్తం 29 స్థానాలను తమ మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి గెలుచుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా 17 ఎంపీ స్థానాలలోనూ తమదే విజయమని కేసీఆర్ స్పష్టం చేశారు, మజ్లిస్​, బీఆర్ఎస్​ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని, భవిష్యత్తులోనూ ఈ స్నేహం కొనసాగుతుందని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్​ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2.38 గంటలకు తెలంగాణ భవన్​లో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్​ను దీవిస్తారనే నమ్మకం ఉందని, 105 స్థానాలలో విజయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • వరంగల్​లో మేనిఫెస్టో 

అక్టోబర్16న వరంగల్​నగరంలో ‘సింహగర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్​ ప్రకటించారు. భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు. ప్రజలకు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలో తమ దగ్గర స్పష్టంగా ఉందన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో లేని చాలా పథకాలను తాము అమలు చేస్తున్నామని వివరించారు. తాము ఎన్నికలను పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామ‌ని సీఎం కేసీఆర్​అన్నారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్‌ గేమ్ అని, బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం ఒక టాస్క్‌ అని అన్నారు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో:బీఆర్‌ఎస్‌ సముద్రం లాంటిదని, టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీలోనే ఉంటూ అభ్యర్థులను గెలిపించుకోవాలని, రాబోయే రోజులలో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయని, రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ, జెడ్పీ చైర్మన్​ఇలా అనేక అవకాశాలు ఉంటాయని అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని, ఏదో ఓ సందర్భంలో అందరికీ న్యాయం చేస్తామని, గతంలోనూ అలానే చేశామని, ఈ ఎన్నికలలోనూ భారీ విజయం సాధించి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామ‌ని కేసీఆర్‌ అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘింస్తే చర్యలు తప్పవని, రాజకీయంగా ఎటూ కాకుండా పోతారని, పార్టీ క్రమశిక్షణ దాటితే తీసి అవతల పారేస్తామని హెచ్చరించారు. తమది సన్యాసుల మఠం కాదని, రాజకీయ పార్టీ అని, ఓట్లు కావాలని అనుకుంటామని, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని, ప్రగతి అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో అన్ని అంశాలు పరిశీలించామని, పూర్తి స్థాయి వ‌డ‌పోత త‌ర్వాత‌, అనేక స‌ర్వేల త‌ర్వాత, బాధ్యత‌తో జాబితాను విడుద‌ల చేశామన్నారు. అక్కడ‌క్కడ ఏమైనా వివాదాలు ఉంటే అవే స‌ర్దుకుంటాయని, తమ పార్టీ చాలా క్రమ‌శిక్షణ గ‌ల పార్టీ అని, తమ పార్టీలో యుద్ధాలు ఉండ‌వని, ఒకేసారి 115 సీట్లు ప్రక‌టించాం అంటేనే అర్థం చేసుకోవాలని అన్నారు. తమ పార్టీలో ఎంత గ‌డిబిడి త‌క్కువ‌గా ఉందో అర్థం చేసుకోవాలని, ఎక్కడ్నో ఒక‌ట్రెండు చోట్ల ఉంటే.. కొన్ని భూత‌ద్దాలు పెట్టి చూపించే చానెల్స్ ఉన్నాయని, అవన్నీ తమకు తెలుసు అని, వాటిని కేర్ కూడా చేయమని, ప‌ట్టించుకోమని, పొద్దున లేస్తే కావాల్సుకుని విషం చిమ్మే వాడు ఉంటే, అది వానికే రివ‌ర్స్ ప‌డుత‌ది త‌ప్ప తమకేం ప‌డ‌దు అని కేసీఆర్ పేర్కొన్నారు.

  • పూర్తిస్థాయిలో చర్చించాకే

వచ్చే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామని కేసీఆర్ చెప్పారు. భూపాలపల్లిలో వెంకట్రమణారెడ్డికి సీటు ఇస్తామంటే మధుసూదనాచారి అండదండగా ఉంటామని చెప్పారని, తాండూరులోనూ పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఇస్తామంటే మహేందర్‌రెడ్డి మద్దతిచ్చారని, కోరుట్లలో విద్యాసాగర్​ రావు తనయుడికి టికెట్​ ఇవ్వాలని కోరారని, ఆ ప్రకారమే తాము టికెట్లు కేటాయించామని చెప్పారు. ఉన్నంతలో అన్ని సర్దుబాట్లు చేసుకుని ఎలాంటి వివాదాలకు తావులేకుండా అభ్యర్థుల జాబితా విడుదల చేశామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్​ లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజులలో కమిటీ మరోసారి భేటీ అవుతుందని, ఈ స్థానాలలో కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజలలోనే ఉన్నారని, అలాంటి వారికే టికెట్లు ఇచ్చామని అన్నారు. టికెట్లు వచ్చిన వాళ్లందరికీ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. టికెట్లు వచ్చిన అభ్యర్థులందరూ అద్భుత విజయం సాధిస్తారని, సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఇక, నియోజకవర్గాల్లోని సమస్యలు పరిష్కరించేందుకు పార్టీలోని నేతలతో ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని చెప్పారు. 

  • పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తాం

నియోజకవర్గాలలో ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఇప్పటికే ఏడు స్థానాలలో అక్కడి పరిస్థితుల ప్రకారమే మార్చామన్నారు. ఎన్నికల వరకు పరిస్థితులన్నీ అంచనా వేసుకుంటామని, ఇది అభ్యర్థులు కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. 

  • అందుకే రెండు చోట్లా పోటీ

పార్టీ నిర్ణయం మేరకు తాను కామారెడ్డి, గజ్వేల్​ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు కేసీఆర్​ ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ చరిత్ర తెల్వదు.. కరీంనగర్​ నుంచి రివర్స్​ల మహబూబ్​నగర్​ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా’ అని మీడియా ముందు చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​, నిజామాబాద్​ జిల్లా మంత్రి తనను వ్యక్తిగతంగా కోరారని, కేవలం వీళ్లు మాత్రమే కాదని, చాలా జిల్లాల నుంచి అడిగారని, చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డిలో పోటీ చేసేందుకు ఫిక్స్ అయ్యాయని, అంతేకానీ ఇందులో ఏం ప్రత్యేకత లేదని కేసీఆర్​ చెప్పారు. 

  • ఏడుగురు మహిళలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలకు బీఆర్‌ఎస్‌ పార్టీ చోటు కల్పించింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఏడుగురు మహిళలకు స్థానం దక్కింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు. 2018 ఎన్నికలలో ఆసిఫాబాద్‌ నుంచి ఓటమిపాలైన కోవా లక్ష్మీతోపాటు మెదక్‌, ఆలేరు, ఇల్లందు, మహేశ్వరం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైన పద్మా దేవేందర్‌ రెడ్డి, గొంగడి సునితా మ‌హేంద‌ర్‌రెడ్డి, హరిప్రియా నాయక్‌, సబితారెడ్డికి ఈసారి కూడా టికెట్లు కేటాయించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్‌ నిరాకరించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం నుంచి 2018 గెలుపొందిన సాయన్న మరణించడంతో ఆయన కూతురు లాస్య నందితను పోటీకి నిలపాలని కేసీఆర్‌ నిర్ణయించారు.