ఎన్నికల వేళ..  పథకాల మేళా!

ఎన్నికల వేళ..  పథకాల మేళా!
  • కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం
  • ఇప్పటికే ‘బీసీలకు లక్ష సాయం’ పథకం
  • రెండో విడత దళితబంధు, ఉద్యోగులకు డీఏ, 30న పోడు పట్టాల పంపిణీ
  • మూడోసారి అధికారమే లక్ష్యాంగా బీఆర్ఎస్​ప్రణాళిక

ముద్ర, తెలంగాణబ్యూరో : నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తోన్న అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలు జోరు పెంచింది. ఇప్పటికే రెండో విడత దళితబంధు, రెండో విడత గొర్రెల పంపిణీ చేసింది. ఉద్యోగులకు డీఏ ప్రకటన చేసింది. ఈనెల 30 పోడు భూములకు పట్టాలు ఇవ్వనుంది. బీసీలకు లక్ష సాయం , 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల మంజారు వంటి పథకాల అమలను వేగం చేసింది. తాజాగా అర్హులైన పేదలందరికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. కొత్త రేషన్ కార్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలను కోరింది.  రేషన్ కార్డు దరఖాస్తుల కోసం మీసేవ కేంద్రాల్లో సంప్రదించాలని సూచించింది. 2018 ఎన్నికల ముందు రేషన్ కార్డులకు సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో దరఖాస్తులను పరిశీలించి 2021 వరకు పలు దఫాల్లో 3.11 లక్షల కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత కొత్త దరఖాస్తులు ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త కార్డులను ఇవ్వకపోగా, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే  రేషన్ కార్డు నుంచి సదరు వ్యక్తి పేరును అధికారులు తొలగించేవారు. అలాగే కొత్తగా జన్మించిన వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చలేదు. ఈ మార్పుల కోసం ఎఫ్ఎస్పీ ఆర్ఎం వెబ్ సైట్ లో చేసుకున్న దరఖాస్తులకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. 

దళితబంధు జీఓ విడుదల

ఎన్నికలు సమీపించడంతో రెండో విడత దళితబంధు జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వారికి రూ.10 లక్షల చొప్పున సాయం చేయనున్నారు. అలాగే జూన్​9న సీఎం కేసీఆర్ రెండో విడత గొర్రెల పథకాన్ని ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. రెండో విడత గొర్రెల పథకానికి రూ.11 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా రెండు లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేశారు.
 
బీసీలకు లక్ష సాయం..

బీసీ వర్గాల్లోని కులవృత్తిదారులకు లక్ష రూపాయల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం సుమారు 5,28,802 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అలాగే 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించింది. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని కోకాపేట, ఉప్పల్ భగాయత్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన 87.5 ఎకరాల భూమితోపాటు రూ.95.25 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని తలపెట్టగా ఇప్పటికే 31 భవనాలు పూర్తి చేసింది. తాజాగా ఎన్నికల వేళ గౌడ కుల ఆత్మగౌరవ భవనానికి మంత్రులు గంగుల, శ్రీనివాస్ గౌడ్ భూమిపూజ చేశారు. గొల్ల, కురుమ ఆత్మగౌరవ భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 

జూన్​30న పోడు భూములకు పట్టాలు..

ఎన్నికలు సమీపిస్తుండటంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పోడుభూములకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. జూన్​30న గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా పోడుభూములు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సుమారు 1.55 లక్షల మందికి పోడు భూముల పట్టాలను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు.