రాలిన ‘స్వప్నా’లు

రాలిన ‘స్వప్నా’లు
  • ఆశల సౌధాలు అగ్నికి ఆహుతి
  • ఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు
  • గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు 
  • గ్రేటర్​లో నిత్యకృత్యమవుతున్న  ప్రమాదాలు
  • ఘటనలు జరిగినప్పుడే సర్కారు హల్​చల్​
  • శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్


ముద్ర, తెలంగాణ బ్యూరో:
కాల్ సెంటర్​ఉద్యోగం కాటికి పంపింది. అగ్ని ప్రమాదం రూపంలో కలల సౌధాలను చిదిమేసింది. తమ ఆశా దీపాలను అక్కున్న చేర్చుకున్న  సికింద్రాబాద్  స్వప్నలోక్ కాంప్లెక్స్ తమ వారసులను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లిందన్న సమాచారం అందుకున్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అగ్ని ప్రమాదంలో తమ బిడ్డలు చనిపోయారని తెలిసి ఓరుగల్లువాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో చనిపోయినవారిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్ జిల్లావారే కావడం కలిచివేస్తోంది. మృతులు స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని బీఎం 5 కాల్ సెంటర్ లో పని చేసేవారని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఊపిరాడక వారు మృత్యువు దరికి చేరారు. పిడుగు లాంటి కబురందుకుని అక్కడికి చేరుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విగత జీవులైన తమ బిడ్డలను చూసి వారు రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. 

ఏం జరిగిందంటే?
సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి  7, 8 అంతస్థులలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 5, 6 అంతస్థులకు వ్యాపించాయి. మంటలు అంటుకున్న ఫ్లోర్లలో ప్రైవేట్‌ కార్యాలయాలు, దుస్తుల గోదాములు ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో  ప్రమాదం చోటుచేసుకున్నది. కొందరు ప్రాణాలతో బయటపడగా, మరి కొందరు మంటలలో చిక్కుకున్నారు. తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని భావించిన అధికారులు సమీప నివాసాలలో ఉన్న వారిని సైతం ఖాళీ చేయించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి 13 మందిని బయటకు తీసుకొచ్చారు. వీరిలో ఆరుగురు స్పృహ కోల్పోగా హుటాహుటిన గాంధీ దవాఖానకు ఐదుగురిని, అపోలో దవాఖానకు ఒకరిని తరలించారు. వీరు అక్కడే తుదిశ్వాస విడిచారు. నలుగురు యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

మృతులు వీరే
మహబూబాబాద్ జిల్లా సురేశ్ నగర్ కు చెందిన ప్రమీల (22), కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్ (23), వరంగల్ జిల్లా నర్సంపేటకు మండలం ఖానాపూర్ తండాకు చెందిన బి శ్రావణి(22), మర్రిపల్లికి చెందిన వెన్నెల (22), నర్సంపేటకు చెందిన శివ (22)  ప్రమాదంలో మరణించారు. మరో మృతురాలు త్రివేణి  ఖమ్మం జిల్లా నేలకొండపల్లివాసిగా పోలీసులు ప్రకటించారు. స్వప్న లోక్‌ కాంప్లెక్స్​ ఎప్పుడూ రద్దీతో ఉంటుంది. రకరకాల వ్యాపార సంస్థలు ఉండటంతో చాలామంది వస్తుంటారు. గురువారం వర్షం కురవడంతో  ఎక్కువ మంది రాలేదు. లేకపోతే మరింత తీవ్ర పరిస్థితి ఉండేది. డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం ఘటన మరువకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో  స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నిరుడు సికింద్రాబాద్ బోయగూడలోని ఓ భవనంలోని తుక్కు గోదాములో మంటలు చెలరేగి 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. రూబీ లగ్జరీ ప్రైడ్​ హోటల్​లో అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది పర్యాటకులు చనిపోయారు. బాగ్ అంబ‌ర్‌పేట‌లో, బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి.  చెన్నారెడ్డి నగర్‌లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి.  ఇలా గ్రేటర్​లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారణ చర్యలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. 

రూ. 5 లక్షల పరిహారం
గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు. ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీతో కలిసి గాంధీ ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేలా అధికారులను ఆదేశించారు. జాగ్రత్తలు పాటించని భవన, గోదాముల నిర్వాహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను సీజ్‌ చేస్తామని ప్రకటించారు.