వేలంతో వేల కోట్లు!

వేలంతో వేల కోట్లు!
  • వరుస పెట్టి భూములు అమ్ముతున్న కేసీఆర్​సర్కారు
  • మోఖిల–2 భూములకు వేలం
  • నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
  • ఇప్పటికే రూ.7 వేల కోట్లు దాటిన అమ్మకాల రాబడి
  • మరో రూ.4 వేల కోట్ల కోసం సర్కారు ప్లాన్​
  • భూముల అమ్మకంపైనే అధికార యంత్రాంగం దృష్టి

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ బూంను ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. నగర శివార్లలో డిమాండ్ ఉన్న భూములను వేలం వేసి వేల కోట్ల రూపాయలను తన ఖాజానాలో వేసుకుంది. నగరం నాలుగు దిక్కులా ఉన్న భూములను అటు ఎకరాలతోపాటు ఇటు గజాల లెక్కన ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. భూములను ఎడా పెడా అమ్మేసి ఆ డబ్బులనే ఎన్నికలకు ముందు ప్రకటించిన స్కీంలకు కేటాయిస్తున్నారు. 

  • పవర్​లోకి రాకముందు వ్యతిరేకించిన కేటీఆర్..

హెచ్ఎండీఏ వేలం వేస్తున్న భూములు కొంటున్న వాటిలో కీలక కంపెనీలు ప్రభుత్వానికి చెందిన అస్మదీయులవే అనే చర్చ కూడా అధికారవర్గాల్లో ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా పలు జిల్లాల్లో కూడా కేసీఆర్ సర్కారు భూములను అమ్మకానికి పెట్టింది. అధికారంలోకి రాకముందు ఇప్పటి మినిస్టర్​కేటీఆర్.. ‘ప్రభుత్వ భూముల వేలంపాట ఆపాలి... ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలి’ అంటూ ప్ల కార్డు పట్టుకుని ధర్నాలో కూర్చున్నారు. కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో కేసీఆర్​సర్కారు ప్రభుత్వ భూములను వేలం వేస్తోంది. అసలు సిసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు సాగుతోంది. కోకాపేటలో ఇప్పటికే రెండు విడతల అమ్మకాలు పూర్తి చేసింది. ఆ తర్వాత బుద్వేల్.. ఇప్పుడు మోఖిలా వంతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా మరిన్ని భూముల విక్రయాలు ఉండనున్నాయి. ఎక్కువ గ్యాప్ లేకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదు అని డిమాండ్ చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఎకరం వంద కోట్ల రూపాయల ధర పలికింది అని గొప్పగా చెప్పుకోవటమే కాకుండా.. భూముల అమ్మకాన్ని కూడా ఒక ఘనతగా ప్రకటించుకుంటున్నారు. 

  • జోష్​లోనే సేల్స్..​

కోకాపేట భూములకు ఎకారానికి వంద కోట్లు పలకడంతో దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న భూముల జాబితాలో చేరింది. ఆ తర్వాత అదే ఊపులో బుద్వేల్ భూములను సైతం అమ్మేశారు. ఇప్పుడు శంకర్ పల్లి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మోఖిలా లే అవుట్లోని భూములను కూడా హెచ్ఎండీఏ ఈ వేలం నిర్వహించింది. ఆగస్టు 8న నిర్వహించిన ఈ- వేలంలో ప్లాట్లు భారీగా అమ్ముడుపోగా ఒక్కో గజం అత్యధికంగా రూ.లక్ష పలకటం గమనార్హం. తొలి విడుతలో మొత్తం 50 ప్లాట్లు అమ్మగా ఇప్పుడు అదే మోఖిలా లే అవుట్‌లోని మరో 300 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. మోఖిలా ఫేజ్-–2 భూముల వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 300 ప్లాట్లలో 98,975 గ‌జాల‌ను హెచ్ఎండీఏ అమ్మకానికి పెట్టింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులకు ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్‌ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు. రూ.ల‌క్ష కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాట్లతో గ‌జానికి రూ.25 వేలుగా క‌నీస ధ‌ర నిర్ణయించింది. ఈసారి 98,975 గ‌జాల అమ్మకంతో రూ.800 కోట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది.

  • ఇప్పటికే వేల కోట్లు..

ఇటీవల కోకాపేటలో 45 ఎకరాలకుపైగా భూమిని అమ్మిన హెచ్​ఎండీఏ.. సర్కారు ఖాతాలో రూ.3,319 కోట్లు జమ చేసింది. బుద్వేల్​లో వంద ఎకరాలను అమ్మి రూ.3,625 కోట్లు సంపాదించింది. మోఖిలా తొలి ఫేజ్​లో 48 ఫ్లాట్లను విక్రయించి, రూ.121 కోట్లను తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఇక్కడే రెండో ఫేజ్​లో రూ.800 కోట్లకు అంచనా వేసింది. 

  • మరో 4 వేల కోట్లు కావాల్సిందే!

ప్రస్తుతం రుణమాఫీతో పాటుగా పలు పథకాల కోసం సర్కారుకు అత్యవసరంగా రూ.5వేల కోట్లకుపైగా కావాల్సి ఉంది. దీనిలో భాగంగా ముందస్తుగా వైన్​షాపులకు టెండర్లు వేసి, రూ.1,500 కోట్లకుపైగా ఆదాయం తెచ్చుకుంటున్నది. దీంతోపాటుగా పలు ప్రాంతాల్లో మిగిలిన భూములను వేలం వేసి ఇంకో రూ.4 వేల కోట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 

==========================================================
ఇటీవల అమ్మిన భూములు, వచ్చిన ఆదాయం
============================================================
స్థలం  విస్తీర్ణం   వచ్చిన ఆదాయం
కోకాపేట  45.33 ఎకరాలు  3,319 కోట్లు
బుద్వేల్​  100.1ఎకరాలు  3,625.73 కోట్లు
మోఖిలా  48 ప్లాట్లు   121 కోట్లు

============================================================

  • భూములన్నీ ఆక్రమిస్తున్నరు : రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ సీఎం కేసీఆర్ కుటుంబం ఆక్రమిస్తోందని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.లక్ష కోట్ల మేర కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు.  ఈ సందర్భంగా రేవంత్​వారిని పార్టీలోకి  ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలోని 14 కు 14 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దళితులకు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ భూములు ఇస్తే , అభివృద్ధి ముసుగులో కేసీఆర్ సర్కార్ వాటిని గుంజుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం ఎకరాకి రూ.100 కోట్లు పలుకుతుందని, కనీసం దానిలో కోటి రూపాయలైనా పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని రూ.65 వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయని అన్నారు. ఎలాగూ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని గ్రహించిన కేసీఆర్.. భూములను అమ్ముకుని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని ఆరోపించారు. మద్యం టెండర్లు నాలుగు నెలల ముందే ఎట్లా వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ మద్యం టెండర్లను ఆహ్వానిస్తామన్నారు.

  • రూ.7 వేల కోట్లు సంపాదించారు : కిషన్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : బడుగు, బలహీనవర్గాలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ లావాదేవీల కోసం లాక్కొంటోందని బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భూముల వేలం పాటతో ఇప్పటికే రూ.7000 కోట్లు సంపాదించుకున్నారన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కై భూములు పంచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే సైన్స్‌ సిటీకి భూమి ఇవ్వమంటే ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్​కోసం మాత్రం 10 ఎకరాలు భూమి ఇచ్చారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో భూములు అమ్మితే విమర్శించిన మంత్రి కేటీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే భూములు అమ్ముతున్నారని విమర్శించారు. ఆసైన్డ్‌ భూముల వేలం అత్యంత బాధ్యతారాహిత్యమని, కేవలం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.