గెలిచిన ఆనందంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు...

గెలిచిన ఆనందంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు...

ముద్ర,హైదరాబాద్:- మల్కాజిగిరిలో గెలుపుపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తమకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.ప్రజల విశ్వాసానికి తగ్గట్టు తమ పని విధానం ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పారు. తమకు రెండు కర్తవ్యాలు ఉంటాయని, వాటిలో ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం కొట్లాడతామని, రెండోది మోదీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు తెస్తామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు.

ప్రజల ఆశీర్వాదం వల్ల గెలుస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు. మోదీ ఈ పదేళ్లలో పేదవారికి, ధనవంతులకు మధ్య ఉన్న అంతరాలను తగ్గించారని తెలిపారు.దేశంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఈటల రాజేందర్ చెప్పారు. మోదీ పాలనలో ఇప్పుడు దేశంలో బాంబుల మోతలు లేవని అన్నారు. కంటోన్మంట్ రోడ్లతో పాటు చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్లు అన్నీ నెరవేర్చుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.